Josh Tongue: ఇంగ్లండ్‌కు ఆడతాడని ఎప్పుడో పందెం కాసాడు.. ఇప్పుడు జాక్‌పాట్‌ కొట్టేశాడు

Josh Tongue England Debut Banks 50000 Pounds Cash Win For Family Friend - Sakshi

ఐర్లాండ్‌తో ఇవాళ (జూన్‌ 1) మొదలైన ఏకైక టెస్ట్‌ ద్వారా 25 ఏళ్ల జాషువ టంగ్‌ అనే ఇం‍గ్లండ్‌ పేసర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో టంగ్‌ ఇంగ్లండ్‌ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో, అతని ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఒకరు జాక్‌పాట్‌ కొట్టి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. టంగ్‌ 11 ఏళ్ల వయసులో ఉండగా, టిమ్‌ పైపర్‌ అనే అతని ఫ్యామిలీ ఫ్రెండ్‌ ఒకరు, టంగ్‌పై ఓ పందెం కాసాడు. 

టంగ్‌ భవిష్యత్తులో ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ఆడతాడని టిమ్‌ అ‍ప్పట్లో కొంత మొత్తం పందెం కాసాడు. ఇవాళ టంగ్‌ ఇంగ్లండ్‌ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో టిమ్‌ పందెం గెలిచి, 50000 పౌండ్ల (భారత కరెన్సీలో 50 లక్షలకు పైమాటే) జాక్‌పాట్‌ కొట్టేశాడు. టంగ్‌.. చిన్నతనం నుంచి క్రికెట్‌ ఆడటాన్ని గమినిస్తూ వచ్చిన టిమ్‌, అతను ఏదో ఒక రోజు ఇంగ్లండ్‌ జాతీయ జట్టుకు ఆడతాడని జోస్యం చెప్పాడట. 14 ఏళ్ల తర్వాత టిమ్‌ జోస్యం నిజమై, టంగ్‌ ఇంగ్లండ్‌ 711వ ప్లేయర్‌గా టెస్ట్‌ క్యాప్‌ అందుకున్నాడు.  

కాగా, ఐర్లాండ్‌తో టెస్ట్‌కు తొలుత ప్రకటించిన ఇంగ్లండ్‌ జట్టులో టంగ్‌కు చోటుదక్కలేదు. నలుగురు పేసర్లు వివిధ కారణాల చేత అందుబాటులోకి రాకపోవడంతో.. ఆఖరి నిమిషంలో టంగ్‌కు జట్టులో చోటుదక్కింది. కౌంటీల్లో వోర్సెస్టర్‌షైర్‌ తరపున అద్భుతంగా రాణించడంతో టంగ్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. టంగ్‌.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 82 ఇన్నింగ్స్‌లలో 162 వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/51), జాక్‌ లీచ్‌ (3/35), మాథ్యూ పాట్స్‌ (2/36) సత్తా చాటడంతో ఐర్లాండ్‌ 172 పరుగులకే ఆలౌటైంది. టంగ్‌కు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. 

చదవండి: WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్‌ లేదు.. గెలుపు టీమిండియాదే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top