ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీసిన జయదేవ్‌ ఉనద్కత్‌ | Jaydev Unadkat Bags 9 Wickets Vs Leicestershire In England County Championship Matches, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jaydev Unadkat 9 Wickets Video: ఇంగ్లండ్‌ గడ్డపై జయదేవ్‌ ఉనద్కత్‌ మెరుపులు

Published Thu, Sep 14 2023 5:16 PM

Jaydev Unadkat Bags 9 Wickets Vs Leicestershire In England County Championship Matches - Sakshi

ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా బౌలర్‌, భారత దేశవాలీ స్టార్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్‌ కౌంటీల్లో తన రెండో మ్యాచ్‌లోనే 9 వికెట్లతో చెలరేగాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ డివిజన్‌ 2-2023 సెకెండ్‌ లెగ్‌లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఉనద్కత్‌.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి తన జట్టును గెలిపించాడు. ఉనద్కత్‌ ప్రదర్శన కారణంగా ససెక్స్‌ 15 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. 

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మరింత రెచ్చిపోయి 32.4 ఓవర్లలో 94 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌.. హడ్సన్‌ ప్రెంటిస్‌ (65) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. ససెక్స్‌ ఇన్నింగ్స్‌లో జేమ్స్‌ కోల్స్‌ (44), టామ్‌ హెయిన్స్‌ (39), పుజారా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. లీసెస్టర్‌షైర్‌ బౌలర్లలో  శాలిస్‌బరీ 5 వికెట్టు పడగొట్టగా.. స్కాట్‌ కర్రీ, టామ్‌ స్క్రీవెన్‌ తలో 2 వికెట్లు, రైట్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం​ బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్‌.. ఉనద్కత్‌ (3/23), కార్వెలాస్‌ (4/14), హడ్సన్‌ (2/30), హెయిన్స్‌ (1/33) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే కుప్పకూలింది. లీసెస్టర్‌షైర్‌ ఇన్నింగ్స్‌లో రిషి పటేల్‌ (48) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ససెక్స్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. టామ్‌ క్లార్క్‌ (69), జేమ్స్‌ కోల్స్‌ (63) అర్ధసెంచరీలతో రాణించారు. లీసెస్టర్‌షైర్‌ బౌలర్లలో స్క్రీవెన్‌ 4, రెహాన్‌ అహ్మద్‌ 2, రైట్‌, స్కాట్‌ కర్రీ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

499 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లీసెస్టర్‌షైర్‌.. ఉనద్కత్‌ (6/94), కార్వెలాస్‌ (2/58), జాక్‌ కార్సన్‌ (2/98) ధాటికి 483 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ససెక్స్‌ 15 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఉనద్కత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్‌ జట్టుకు టీమిండియా నయా వాల్‌ చతేశ్వర్‌ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిం‍దే.

Advertisement
 
Advertisement