ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం.. వరల్డ్‌కప్‌ జట్టులో కీలక మార్పు

Jason Roy Axed For Harry Brook As England Finalize World Cup Squad - Sakshi

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వరల్డ్‌కప్‌ జట్టులో కీలక మార్పు చేసింది. ముందుగా ప్రకటించిన జట్టులో సభ్యుడైన జేసన్‌ రాయ్‌పై వేటు వేసి యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను వరల్డ్‌కప్‌ జట్టులోకి తీసుకుంది. గత కొద్ది రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్న రాయ్‌.. కోలుకోకపోవడంతో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

2019లో ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన రాయ్‌.. వెన్నునొప్పి కారణంగా ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయాడు. ఈ సిరీస్‌లో రాయ్‌ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన డేవిడ్‌ మలాన్‌.. అద్భుతంగా రాణించి, ఓపెనర్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మలాన్‌ ఈ సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 92.33 సగటున, 105.73 స్ట్రయిక్‌రేట్‌తో 277 పరుగులు చేశాడు.

ఈ ప్రదర్శనతో మలాన్‌ వరల్డ్‌కప్‌లో ఓపెనర్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. మలాన్‌ను జతగా జానీ బెయిర్‌స్టో మరో ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు. మలాన్‌ ఓపెనర్‌ బెర్త్‌కు ఫస్ట్‌ ఛాయిస్‌గా మారడం, రాయ్‌ ఇటీవలికాలంలో పెద్దగా ఫామ్‌లో లేకపోవడంతో అతనిపై వేటు పడిం‍ది. అయితే, ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో పెద్ద ఆకట్టులేకపోయిన హ్యారీ బ్రూక్‌ను రాయ్‌ స్థానంలో వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

బ్రూక్‌ ఇతర ఫార్మాట్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకుని ఇంగ్లండ్‌ సెలెక్టర్లు అతన్ని వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేసి ఉండవచ్చు. బ్రూక్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ కావడం​ అతని ఎంపికకు మరో కారణం కావచ్చు. ఇటీవల ముగిసిన హండ్రెడ్‌ టోర్నీలో బ్రూక్‌ చేసిన సెంచరీని, కివీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని ఫామ్‌ను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుని ఉంవచ్చు. 

కాగా, ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన 4 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే పర్యటనలో అంతకుముందు జరిగిన 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది.  

ఇంగ్లండ్‌ ప్రపంచ కప్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, జో రూట్, డేవిడ్ మలాన్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లే, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, డేవిడ్‌ విల్లీ, సామ్ కర్రన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top