
భారత బాక్సింగ్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. లివర్‌పూల్‌లో జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో ముగ్గురు మహిళా బాక్సర్లు పతకాలు సాధించారు. నుపూర్ 80 ప్లస్ కేజీల విభాగంలో రజత పతకం సాధించగా.. పూజా రాణి 80 కేజీల విభాగంలో కాంస్యం.. తాజాగా జైస్మిన్ లంబోరియా 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ఫలితం (ముగ్గురు మహిళా బాక్సర్లకు పతకాలు) ఇదే.
చరిత్ర సృష్టించిన లంబోరియా
తాజాగా జరిగిన 57 కేజీల విభాగం ఫైనల్లో జైస్మిన్ లంబోరియా పోలాండ్‌కి చెందిన ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ జూలియా సెరెమెటాపై 4-1 స్ప్లిట్ డెసిషన్‌తో విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. నూతన గ్లోబల్ బాక్సింగ్ గవర్నింగ్ బాడీగా 'వరల్డ్ బాక్సింగ్' ఏర్పడ్డాక జరుగుతున్న తొలి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఇదే.
నుపూర్‌కు రజతం
ఇదే టోర్నీలో 80 ప్లస్ కేజీల విభాగంలో నుపుర్ గోల్డ్ మిస్ అయ్యింది. అగాటా కాజ్‌మార్స్కాతో (పోలాండ్) ఫైనల్‌లో నుపుర్ 2-3తో పోరాడి ఓడింది.
పూజా రాణికి కాంస్యం
80 కేజీల విభాగంలో పూజా రాణి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్‌కి చెందిన ఎమిలీ ఆస్క్విత్‌తో సెమీఫైనల్‌లో గట్టిగానే పోరాడింది.
భారత బాక్సింగ్‌లో చారిత్రక ఘట్టం
భారత బాక్సింగ్ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి ముగ్గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్‌కు చేరారు. జైస్మిన్, నుపుర్ ఇది వరకే స్వర్ణం, రజతం సాధించగా.. మీనాక్షి 48 కేజీ విభాగంలో స్వర్ణం కోసం పోటీపడాల్సి ఉంది.