
లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత్‌కు మూడో పతకం ఖాయమైంది. ఇప్పటికే నుపుర్ షెరాన్ (ప్లస్ 80 కేజీలు), జైస్మీన్ లంబోరియా (57 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకోగా... 80 కేజీల విభాగంలో పూజా రాణి కూడా సెమీస్‌లో అడుగు పెట్టింది. తొలి రౌండ్‌లో ‘బై’ దక్కించుకున్న 34 ఏళ్ల పూజ క్వార్టర్ ఫైనల్లో 3:2 తేడాతో ఎమిలియా కొటెరస్కా (పోలాండ్)పై విజయం సాధించింది.
సెమీఫైనల్లో ఎమిలీ అస్‌క్విత్ (స్విట్జర్లాండ్)తో పూజ తలపడనుంది. పురుషుల 65 కేజీల విభాగంలో అభినాశ్ జమ్వాల్ 1:4తో ఒలింపిక్ కాంస్య పతక విజేత లాషా గురులి (జార్జియా) చేతిలో ఓడాడు. ఇక భారత్ నుంచి జాదూమణి సింగ్ (48 కేజీలు), మీనాక్షి (48 కేజీలు) మాత్రమే పోటీలో ఉన్నారు. తాష్కెంట్‌లో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి దీపక్ భోరియా (51 కేజీలు), హుసాముద్దీన్ (57 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) కాంస్యాలు సాధించారు.