
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎస్) ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐఎస్‌ఎల్ జట్ల యాజమాన్యాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది. దీని సత్వర పరిష్కారానికి తగిన చర్య తీసుకోవాలని వారు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)ను కోరుతున్నారు.
ఈ క్రమంలో ఐఎస్‌ఎల్ తాజా పరిస్థితిని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.మొత్తం 13 క్లబ్‌లలో మోహన్‌బగాన్ సూపర్ జెయింట్, ఈస్ట్ బెంగాల్ మినహా మిగతా 11 క్లబ్‌ల ప్రతినిధులు ఏఐఎఫ్‌ఎఫ్‌కు రాసిన లేఖపై సంతకం చేశారు.
ఐఎస్‌ఎల్ నిర్వహణ హక్కులు ఉన్న ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్‌ఎస్‌డీఎల్)కు, ఏఐఎఫ్‌ఎఫ్‌కు మధ్య 2010లో ఒప్పందం కుదిరింది.
అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ముగిసే ఈ ఎంఓయూను పునరుద్ధరించుకునే విషయంలో స్పష్టత రాకపోవడంతో టోర్నీని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఎఫ్‌ఎస్‌డీఎల్ ప్రకటించింది.
ఈ ఒప్పంద పునరుద్ధరణ అంశం ప్రస్తుతం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి ఎంఓయూ కుదుర్చుకోరాదని సుప్రీం ఇప్పటికే ఆదేశించింది. న్యాయపరంగా ఎంఓయూలో తాము భాగం కాదు కాబట్టి నేరుగా ఈ కేసులో జోక్యం చేసుకోలేకపోతున్నామని... సుప్రీం కోర్టులో సమస్యను వివరించి ఫుట్‌బాల్‌ను కాపాడమంటూ ఐఎస్‌ఎల్ టీమ్‌లు విజ్ఞప్తి చేశాయి.
‘న్యాయపరమైన చిక్కులు ఇప్పుడు భారత ఫుట్‌బాల్‌ను బాగా నష్టపరుస్తున్నాయి. ఐఎస్‌ఎల్ క్లబ్‌లలో పెట్టుబడులు, వాణిజ్యపరమైన కాంట్రాక్ట్‌లు గందరగోళంలో పడటంతో ఆటగాళ్లు, సిబ్బంది, ఇతర భాగస్వాముల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి. దీని వల్ల దేశంలో ఆట ఆగిపోతుంది.
కాబట్టి సుప్రీం దృష్టికి దీనిని తీసుకురండి’ అని ఐఎస్‌ఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. ఐఎస్‌ఎల్ భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా చెన్నై, బెంగళూరు జట్ల యాజమాన్యాలు కూడా ఇప్పటికే తమ సిబ్బందికి జీతాలు ఆపేయడంతో పాటు టీమ్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశాయి.