Irfan Pathan: ఇది ఊహించలేదు.. కోహ్లి నిర్ణయం షాక్‌కు గురిచేసింది

Irfan Pathan Says Its Shocking Virat Kohli Decision Quit T20I Captaincy - Sakshi

డిల్లీ: టి20 ప్రపంచకప్‌ అనంతరం టి20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు టీమిండియా మెషిన్‌ గన్‌ విరాట్‌ కోహ్లి తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. '' గత 8–9 ఏళ్లుగా మూడు ఫార్మాట్‌లలో ఆడుతూ 5–6 ఏళ్లుగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నాపై తీవ్ర పనిభారం ఉంది. దీనిని అర్థం చేసుకోవడం అవసరం. భారత టెస్టు, వన్డే జట్టు కెపె్టన్‌గా నా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించేందుకు నాకు కొంత ఉపశమనం అవసరం.'' అని కోహ్లి చేసిన వ్యాఖ్యలు సగటు అభిమానిని ఆశ్యర్యపరిచింది. కోహ్లి నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటే మరికొందరు మద్దతిచ్చారు.

తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' కోహ్లి నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. టి20 ప్రపంచకప్‌ అనంతరం  ఆ ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు తెలిపాడు. అయితే ఏడాది తిరగకుండానే మరో టి20 వరల్డ్‌కప్‌ జరగనుంది. నా వర​కు కోహ్లి.. టెస్టు కెప్టెన్‌గా బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటాడని భావించా.

కానీ ఇలా నిర్ణయం తీసుకుంటాడని ఊహించలేదు. ఒక టి 20 కెప్టెన్‌గా కోహ్లికిది చివరి ప్రపంచకప్‌.. కాబట్టి టీమిండియా అతని సారధ్యంలో కప్‌ గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఐదేళ్ల పాటు టి20 కెప్టెన్‌గా భారత్‌కు విజయాలు అందించాడు. ఒక కెప్టెన్‌గానే గాక ఒక బ్యాట్స్‌మన్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించిన కోహ్లి పొట్టి ఫార్మాట్‌ నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకోవడం బాధ కలిగించింది. అయితే కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి తప్పుకునే ముందు రవిశాస్త్రి, రోహిత్‌లతో సుధీర్ఘ చర్చల అనంతరమే నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది. కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా రానున్న రోహిత్‌ శర్మను తక్కువ చేసి చూడలేం. అతని కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్‌ నాలుగుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకుంది. కోహ్లి గైర్హాజరీలోనూ రోహిత్‌ టీమిండియాకు మంచి విజయాలు అందించాడు.'' అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: టి20లకు సారథ్యం వహించను: కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top