
ఐర్లాండ్ వెటరన్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకున్న తొలి ఐరిష్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఐరిష్ క్రికెట్‌కు మూలస్థంభంగా ఉన్న స్టిర్లింగ్.. ఆ దేశం తరఫున 8 టెస్ట్‌లు, 167 వన్డేలు, 150 టీ20లు ఆడి 10000 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 57 అర్ద సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో 10000 పరుగులు పూర్తి చేసిన 97వ ఆటగాడిగానూ స్టిర్లింగ్ రికార్డుల్లోకెక్కాడు.
ఐర్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టిర్లింగ్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. స్టిర్లింగ్ తర్వాత ఆండ్రూ బల్బిర్నీ అత్యధికంగా 6055 పరుగులు చేశాడు. ఆతర్వాత కెవిన్ ఓబ్రెయిన్ 5850, విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ 5480, హ్యారీ టెక్టార్ 3732 పరుగులు చేశారు. 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్టిర్లింగ్.. ఆ మరుసటి ఏడాది టీ20లు, 2018లో టెస్ట్ అరంగేట్రం చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. 3 వన్డేలు, 3 మ్యాచ్ టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (మే 21) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్ 35 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
పాల్ స్టిర్లింగ్ (54), కార్మిచెల్ (16) ఔట్ కాగా.. బల్బిర్నీ (87), హ్యారీ టెక్టార్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టిర్లింగ్ 10000 పరుగుల మైలరాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టిర్లింగ్ సాధించిన హాఫ్ సెంచరీ వన్డేల్లో అతనికి 57వది.