Ire Vs Afg 1st T20: అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసిన ఐర్లాండ్‌.. అద్భుత విజయం

Ire Vs Afg 1st T20: Ireland Beat Afghanistan By 7 Wickets Lead In Series - Sakshi

Afghanistan tour of Ireland, 2022- Ireland Vs Afghanistan 1st T20: ఇటీవల కాలంలో మెరుగ్గా రాణిస్తూ క్రికెట్‌ ప్రేమికుల ప్రశంసలు అందుకుంటున్న ఐర్లాండ్‌ జట్టు.. అఫ్గనిస్తాన్‌కు గట్టి షాకిచ్చింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. కాగా ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు అఫ్గనిస్తాన్‌ ఐర్లాండ్‌ టూర్‌కు వెళ్లింది.

శుభారంభమే అయినా..
ఈ క్రమంలో బెల్‌ఫాస్ట్‌లోని సివిల్‌ సర్వీస్‌ క్రికెట్‌ క్లబ్‌ వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య మొదటి టీ20 జరిగింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది అఫ్గనిస్తాన్‌. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్‌(26), ఉస్మాన్‌ ఘని(59) శుభారంభం అందించారు. కానీ ఐర్లాండ్‌ బౌలర్ల ధాటికి మిడిలార్డర్‌ చేతులెత్తేసింది. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ మహ్మద్‌ నబీ(5) తీవ్రంగా నిరాశపరిచాడు. 

ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన ఇబ్రహీం జద్రాన్‌ 29 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి అఫ్గనిస్తాన్‌ 168 పరుగులు చేసింది. ఐర్లాండ్‌ బౌలర్లలో జోషువా లిటిల్‌కు ఒకటి, బ్యారీ మెకార్తీకి మూడు, గరెత్‌ డెలనీకి ఒకటి, జార్జ్‌ డాక్‌రెల్‌కు రెండు వికెట్లు దక్కాయి. 

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌..
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ బ్యాటర్లు ఆది నుంచి దంచికొట్టారు. ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌ 31 పరుగులు చేయగా.. కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ అర్ధ శతకం(38 బంతుల్లో 51 పరుగులు)తో మెరిశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లోర్కాన్‌ టకర్‌ సైతం హాఫ్‌ సెంచరీ(32 బంతుల్లో 50 పరుగులు) చేశాడు. 

హ్యారీ టెక్టర్‌ 15 బంతుల్లో 25, జార్జ్‌ డాక్‌రెల్‌ 5 బంతుల్లో 10 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించిన ఐర్లాండ్‌ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.

హాఫ్‌ సెంచరీ హీరో, కెప్టెన్‌ ఆండ్రూ బల్బిర్నీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లకు ఐర్లాండ్‌ గట్టి పోటీనిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా సేనతో రెండో టీ20లో.. కివీస్‌తో మూడో వన్డేలో ఆఖరి వరకు అద్భుతంగా పోరాడింది.  

చదవండి: Nitu Ghanghas: జీతం లేని సెలవు పెట్టి తండ్రి త్యాగం! కూతురు ‘బంగారం’తో మెరిసి.. 
 Sourav Ganguly: మహిళా క్రికెట్‌ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్‌.. ఆటాడుకుంటున్న నెటిజన్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top