IPL: అమెజాన్‌ అవుట్‌

IPL: Amazon Might Not Bid For IPL Media Rights  - Sakshi

ఐపీఎల్‌ ప్రసార హక్కుల రేసు నుంచి వైదొలిగిన దిగ్గజ కంపెనీ

నాలుగు సంస్థల మధ్యే అసలు పోటీ

రేపు, ఎల్లుండి ‘ఇ–వేలం’

న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ల మధ్య ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మీడియా ప్రసార హక్కుల పోటీ రసవత్తరం అవుతుందనుకుంటే... మరోకటి జరిగింది. ఈ రేసు నుంచి ఓటీటీ సంస్థ అమెజాన్‌ తప్పుకుంది. దీంతో రిలయన్స్‌కు చెందిన ‘వయాకామ్‌ 18’ మిగతా మూడు సంస్థలతో రేసులో నిలిచింది. అమెజాన్‌ సహా డిస్నీ స్టార్, వయాకామ్‌–18, సోనీ, జీ సంస్థలు ప్రాథమిక బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొన్నాయి.

అయితే శుక్రవారం అమెజాన్‌ ప్రైమ్‌ వైదొలగడంతో ఇప్పుడు టీవీ, డిజిటల్‌ హక్కుల పోటీ ప్రధానంగా నాలుగు సంస్థల మధ్యే నెలకొనే అవకాశముంది.  నిజానికి అపర కుబేరుడికి చెందిన అమెజాన్‌ పోటీలో ఉన్నంతసేపూ ఈసారి ఐపీఎల్‌ మీడియా హక్కులకు ఎవరూ ఊహించని విధంగా రూ. 70 వేల  కోట్ల మొత్తం రావొచ్చని బ్రాడ్‌కాస్టింగ్‌ వర్గాలు భావించాయి. కానీ కారణం లేకుండానే అమెజాన్‌ తప్పుకోవడంతో ముందనుకున్న అంచనాలు తప్పే అవకాశముంది. ‘అవును అమెజాన్‌ ఐపీఎల్‌ మీడియా ప్రసార హక్కుల ప్రక్రియ నుంచి వైదొలగింది.

బిడ్‌ వేసేందుకు డాక్యుమెంట్లు తీసుకుంది. కానీ శుక్రవారం కీలకమైన సాంకేతిక బిడ్డింగ్‌లో వాటిని దరఖాస్తు చేయలేదు. గూగుల్‌కు చెందిన యుట్యూబ్‌ వాళ్లు కూడా డాక్యుమెంట్‌ కొనుగోలు చేశారు. కానీ వారు కూడా దరఖాస్తు సమర్పించలేదు. అయితే నాలుగు ప్రధాన టెలివిజన్, స్ట్రీమింగ్‌కు చెందిన మొత్తం 10 సంస్థలు పోటీలో ఉన్నాయి. ఆదివారం మొదలయ్యే ఇ–వేలం రెండు రోజులపాటు జరిగే అవకాశ ముంది.’ అని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  

నిజమా... రూ. 45 వేల కోట్లా?
అమెజాన్‌ వైదొలగినప్పటికీ... పోటీలో ఉన్న సంస్థలన్నీ పెద్ద మొత్తం చెల్లించేందుకు సై అంటున్నాయి. ఐదారేళ్ల క్రితంతో పోల్చుకుంటే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఇప్పుడు అందరి ‘అరచేతి’ లో ఉండటమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిడ్‌ ప్రారంభ ధరే రూ. 32 వేల కోట్లు ఖాయమంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇదే జరిగితే పోటాపోటీలో అక్షరాలా 45 వేల కోట్ల రూపాయాలు ఐపీఎల్‌ మీడియా హక్కుల ద్వారా రావొచ్చని అంచనా. అంటే గత మొత్తం రూ. 16,347.50 కోట్లకు రెండున్నర రెట్లు అధిక మొత్తం ఈసారి గ్యారంటీ!

ఇ–వేలం సంగతేంటి?
బీసీసీఐ టెండర్ల ప్రక్రియతో గత హక్కు లు కట్టబెట్టింది. ఇప్పుడు ఇ–ఆక్షన్‌ (ఎలక్ట్రానిక్‌ వేలం) నిర్వహించనుంది. ఆదివారం మొదలయ్యే ఈ ఇ–ఆక్షన్‌లో పోటీదారులంతా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో బిడ్లు వేస్తారు. స్క్రీన్‌లో ఎక్కువ మొత్తం పెరుగుతున్న కొద్దీ పోటీలో ఉన్న సంస్థలు తప్పుకుంటాయి. చివరకు మిగిలిన సంస్థ విజేతగా నిలుస్తుంది. అయితే ఎంత మొత్తమో కనబడుతుంది కానీ ఎవరు వేసింది అనేది స్క్రీన్‌లో కనపడదు. ఎందుకంటే పలా నా సంస్థ వేసిందంటే దానికి ధీటుగా వేయా లని ఇతర సంస్థలు నిర్ణయించుకుంటాయి.

నాలుగు ‘ప్యాకేజీ’లు
నాలుగు ప్యాకేజీల్లో ఎ, బి, సి పూర్తిగా భారత ఉపఖండానికి సంబంధించినవి. ‘ఎ’  టీవీ హక్కులు, ‘బి’  డిజిటల్‌ రైట్స్‌. ‘సి’ ప్లే–ఆఫ్స్‌ సహా కొన్ని ప్రత్యేక మ్యాచ్‌లకు సంబంధించిన డిజిటల్‌ రైట్స్‌. ఇక ‘డి’ ఉపఖండం మినహా మొత్తం ప్రపంచానికి సంబంధించిన ఉమ్మడి టీవీ, డిజిటల్‌ రైట్స్‌. కొత్తగా ‘ప్రత్యేక’ హక్కులేంటంటే... సీజన్‌లో ఒక్కోసారి మ్యాచ్‌లు పెరిగితే దానికి సంబంధించిన ప్యాకేజీ అన్నమాట. ఒక సీజన్‌లో 74 ఉండొచ్చు. ఇవి మరో సీజన్లలో 84 లేదంటే 94కు పెరగొచ్చు.

ఇవీ ప్రారంభ ధరలు...
‘ఎ’ టీవీ ప్యాకేజి కోసం ఒక్కో మ్యాచ్‌కు రూ. 49 కోట్లు ప్రారంభ బిడ్డింగ్‌ ధర కాగా... ‘బి’ డిజిటల్‌ కోసం మ్యాచ్‌కు రూ. 33 కోట్లు, ‘సి’లో ప్రాథమిక ధర రూ. 11 కోట్లు, ‘డి’లో రూ. 3 కోట్లకు తక్కువ కాకుండా బిడ్‌ వేయాల్సి ఉంటుంది. ఒక సంస్థ ఒకదానికే పరిమితమన్న నిబంధన లేదు. నాలుగు ప్యాకేజీలకూ ఒకే సంస్థ పోటీ పడొచ్చు. అయితే గతంలో ఏక మొత్తంలో ఒకే సంస్థకు కట్టబెట్టినట్లుగా కాకుండా ఈసారి ప్రతీ ప్యాకేజీలో ఎవరు ఎక్కువకు కోట్‌ చేస్తే వాళ్లకే హక్కులిస్తారు. గతంలో టీవీ హక్కులకు భారీ మొత్తం కోట్‌ చేసిన స్టార్‌ నెట్‌వర్క్‌ డిజిటల్‌కు తక్కువ కోట్‌ చేసింది. ఫేస్‌బుక్‌ డిజిటల్‌ కోసం రూ.3,900 కోట్లు కోట్‌ చేసినా... ఓవరాల్‌గా గరిష్ట మొత్తాన్ని పరిగణించి స్టార్‌కు హక్కులిచ్చారు. ఈసారి డిజిటల్‌ విభాగంలో టైమ్స్‌ ఇంటర్నెట్, ఫన్‌ఆసియా, డ్రీమ్‌11, ఫ్యాన్‌కోడ్‌... ఉపఖండం ఆవల హక్కుల కోసం స్కై స్పోర్ట్స్‌ (ఇంగ్లండ్‌), సూపర్‌స్పోర్ట్‌ (దక్షిణాఫ్రికా) కూడా బరిలో ఉన్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top