ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) బెంగళూరు వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. ఈ గెలుపు ద్వారా ఆర్సీబీ ఓ అరుదైన ఘనత సాధించింది. సొంత మైదానం బెంగళూరులో తమ 50వ విజయాన్ని నమోదు చేసింది.
తద్వారా ముంబై ఇండియన్స్ (వాంఖడే), కేకేఆర్ (కోల్‌కతా), సీఎస్‌కే (చెన్నై) జట్ల సరసన చేరింది. ఈ జట్లు కూడా తమతమ సొంత వేదికలపై 50 విజయాలు నమోదు చేశాయి. గత 18 సీజన్లలో కలిపి బెంగళూరులో 46 విజయాలు నమోదు చేసిన ఆర్సీబీ, ఈ ఒక్క సీజన్‌లో ఇప్పటికే (5 మ్యాచ్‌ల్లో) 4 విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో బెంగళూరులో ఆర్సీబీకి ఎదురైన ఏకైక పరాజయం ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో. ఈ మ్యాచ్‌లో 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారానూ ఆర్సీబీ ఓ ఘనత సాధించింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 ప్లస్ టార్గెట్‌ను ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్, ఎస్‌ఆర్‌హెచ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఛేదించిన 206 పరుగుల లక్ష్యం ఆ జట్టుకు ఐపీఎల్‌లో రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా నిలిచింది.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన టాప్-5 జట్లు
పంజాబ్ కింగ్స్- 10
ముంబై ఇండియన్స్- 6
ఆర్సీబీ-5
రాజస్థాన్- 5
ఎస్ఆర్హెచ్- 5
ఐపీఎల్‌లో ఆర్సీబీ ఛేదించిన 200 ప్లస్ లక్ష్యాలు
228 vs LSG, లక్నో, 2025
206 vs GT, బెంగళూరు, 2026*
204 vs KXIP, బెంగళూరు, 2010
202 vs SRH, బెంగళూరు, 2026
201 vs GT, అహ్మదాబాద్, 2024
ఐపీఎల్‌లో ఒక వేదికపై ఒక జట్టు సాధించిన అత్యధిక విజయాలు
58 - MI (వాంఖడే)
55 - KKR (కోల్‌కతా)
53 - CSK (చెన్నై)
50 - RCB (బెంగళూరు)*
40 - SRH (హైదరాబాద్)
*సూపర్ ఓవర్ విజయాలతో కలిపి
కాగా, నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కాడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.


