ఐక్యరాజ్యసమితికి తొలి మహిళా ప్రధాన కార్యదర్శి!
సెక్రటరీ జనరల్ రేసులో ఇద్దరు మహిళలు.
మిచెల్ బాచెలెట్ వర్సెస్ రెబెకా గ్రిన్ స్పాన్.
విశ్వశాంతి స్థాపనే మహోన్నత లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించి 81 ఏళ్లు. ఈ అంతర్జాతీయ సంస్థలో అతి ముఖ్యమైన పదవి- ప్రధాన కార్యదర్శి (సెక్రటరీ జనరల్). ప్రపంచంలో అతి కష్టమైన ఉద్యోగం ఇది! ఎనిమిది దశాబ్దాలకు పైబడిన కాలంలో ఇప్పటివరకు మహిళలెవరూ ఐరాస పీఠం ఎక్కలేదు, పగ్గాలు చేపట్టలేదు. కానీ ప్రస్తుతం ఇద్దరు అతివలు సహా నలుగురు వ్యక్తులు ఆ పదవికి బరిలో నిలిచారు.
చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ జెరియా (74), కోస్టారికా మాజీ ఉపాధ్యక్షురాలు రెబెకా గ్రిన్ స్పాన్ మయుఫిస్ (70), సెనెగల్ మాజీ అద్యక్షుడు మాకీ సాల్ (64), రఫేల్ మారియానో గ్రోసీ (65) వారిలో ఉన్నారు. మిచెల్ బాచెలెట్ గతంలో ఐరాస మానవ హక్కుల హై కమిషనర్, ‘యూఎన్ ఉమన్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవులు అధిరోహించారు. బ్రెజిల్, మెక్సికో ఈమెను నామినేట్ చేస్తున్నాయి. ఆర్థికవేత్త అయిన రెబెకా గ్రిన్ స్పాన్ గతంలో ఐరాసలో వర్తకం, అభివృద్ధి విభాగమైన ‘యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (అంక్టాడ్)కు సారథ్యం వహించారు. ప్రస్తుతం ఈమెను ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి స్వదేశం కోస్టారికా నామినేట్ చేస్తోంది. ఇక జియాలజిస్టు అయిన మాకీ సాల్ ను బురుండీ నామినేట్ చేస్తోంది. దౌత్యవేత్త అయిన మరో అభ్యర్థి రఫేల్ గ్రోసీని స్వదేశం అర్జెంటీనా నామినేట్ చేస్తోంది. ఐరాసకు చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు గ్రోసీ గతంలో డైరెక్టర్ జనరల్.
రొటేషన్ రూటు- భద్రతామండలి ఓటు!
ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి అభ్యర్థులు తమంతట తాముగా పోటీపడే అవకాశం లేదు. వారిని సంస్థ సభ్యదేశాలు నామినేట్ చేయాలి. ఐరాస ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబరు 31తో ముగుస్తోంది. కొత్త నేత 2027లో బాధ్యతలు స్వీకరిస్తారు. భౌగోళికంగా పశ్చిమ యూరప్ (పోర్చుగల్) ప్రాంతానికి చెందిన గుటెరస్ 2017 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2021లో ఆయన రెండోసారి ఆ సీటుకు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఐరాస సెక్రటరీ జనరల్ పదవికి ఏ దేశస్థులైనా పోటీ చేయవచ్చు. అయితే భౌగోళికంగా అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిధ్యం లభించాలనే ఉద్దేశంతో ఆ పదవిని రొటేషన్ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు. ఇది సంప్రదాయమే తప్ప ఐరాస నిబంధనల్లో రాసి లేదు. దీనిపై బాచెలెట్, గ్రిన్ స్పాన్, గ్రోసీలను మినహాయిస్తే మాకీ సాల్ అభ్యర్థిత్వం విషయంలో మాత్రం వివాదం చోటుచేసుకుంది. రివాజుగా వస్తున్న ‘భౌగోళిక ప్రాంతాలవారీ రొటేషన్’కు భిన్నంగా ఆయన బరిలో నిలవటమే అందుకు కారణం. ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, తూర్పు యూరప్, లాటిన్ అమెరికా- కరీబియన్, పశ్చిమ యూరప్ తదితర ప్రాంతాల నుంచి ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేస్తారు.
ఈదఫా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతాలకు చెందిన నేత ఎంపికవ్వాలి. కానీ, మాకీ సాల్ స్వదేశం సెనెగల్ కాగా, ఆయనను బురుండీ నామినేట్ చేస్తోంది. ఇవి రెండూ ఆఫ్రికా దేశాలు. ‘ఆఫ్రికన్ యూనియన్’లో 55 సభ్యదేశాలు ఉండగా అందులో దాదాపు 20 దేశాలు మాకీ సాల్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం లేదు. స్వదేశం సెనెగల్ సైతం ఆయన నామినేషన్ ను ఆమోదించకపోవడం కొసమెరుపు!. అలాగే ఐరాసలో ఐదు శాశ్వత సభ్యదేశాలైన (పీ5/పర్మినెంట్ 5) అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా నుంచి ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేయరు. ఇది నిబంధనల్లో కనిపించని మరో అలిఖిత కట్టుబాటు! ఐరాస అత్యున్నత పదవిని తొలిసారిగా ఓ మహిళకు అప్పగించాలనే డిమాండ్లు సర్వత్రా ఊపందుకుంటున్నాయి.
ఆంటోనియో గుటెరస్ కూడా ఈ వాదనతో గళం కలిపారు. ఐరాస ప్రధాన కార్యదర్శిని భద్రతామండలి సిఫార్సుకు అనుగుణంగా ఐదేళ్ల పదవీ కాలానికి 193 సభ్యదేశాలతో కూడిన ఐరాస సాధారణ సభ మెజారిటీ ఓటు ప్రాతిపదికన నియమిస్తుంది. ఏ వ్యక్తి అయినా గరిష్ఠంగా రెండుసార్లు ఈ పదవిలో కొనసాగవచ్చు. ‘పీ5’ దేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలదే భద్రతామండలిలో పెత్తనం. వీటికి వీటో అధికారం ఉంది. ఈ ‘పీ5’ శాశ్వత దేశాలతోపాటు భద్రతామండలిలో రెండేళ్ల కాలనిర్దేశంతో మరో 10 తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి.
అలా ఈ మొత్తం 15 దేశాలకు గాను ‘వీటో వేటు’ పడకుండా అభ్యర్థి 9 (మెజారిటీ) ఓట్లు సాధించాల్సివుంటుంది. అంటే అభ్యర్థి మొదట ‘పీ5’ దేశాలన్నిటికీ నచ్చాలి! ఆ తర్వాతే మిగతా ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆ ఐదింటిలో ఏ ఒక్క దేశం ‘వీటో’ చేసినా (నిరాకరించడం) అభ్యర్థి ఓడిపోయినట్టే. ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి 2016లో 13 మంది నామినేషన్స్ పొందగా ఈసారి పోటీపడే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇది ‘సమితి’ తన పూర్వ ప్రాభవం, భావి ప్రాధాన్యం కోల్పోతోందనడానికి సూచికా? రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాలను నివారించలేని సంస్థ అశక్తత, అసమర్థతలకు నిదర్శనమా?!
- జమ్ముల శ్రీకాంత్
Courtesy: Deutsche Welle (DW) News
(Germany’s state-owned, public international broadcaster)


