కోల్‌కత్తా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా ప్రధాని మోదీ హుగ్లీ నదిలో పడవ షికారు చేయడం.. గంగా, హుగ్లీ నది గురించి మాట్లాడటంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ప్రధాని మోదీ యమునా నదిలో స్నానం చేయాలని సవాలు విసిరారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హౌరాలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గంగానది శుభ్రంగా ఉందని, యమునా మాత్రం కాలుష్యంతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. “ఢిల్లీ యమునాలో ఒకసారి స్నానం చేసి చూపించండి. అది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. మీరు యమునాను శుభ్రం చేయలేరు, కానీ ఇక్కడ గంగానది మీద ఫోటోలు దిగడానికి వస్తారు” అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఇదే సమయంలో ప్రధానమంత్రి పర్యటనను మమతా బెనర్జీ స్వాగతించారు. కానీ నదిని శుభ్రపరచడానికి మరియు దాని నదీ తీరాన్ని సుందరీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌ను ప్రశంసించారు. రాష్ట్రంలో ఓట్లు రాబట్టడానికే ఆయన పడవ ప్రయాణం చేశారని ఆమె ఆరోపించారు. కానీ, బెంగాలీలు అంత అమాయకులు కాదంటూ వ్యాఖ్యానించారు.
హూగ్లీలో మోదీ పడవ షికారు..
ఇక, అంతకుముందు ప్రధాని మోదీ.. హూగ్లీ నదిలో కొద్దిసేపు బోటు షికారు చేశారు. అక్కడి రమణీయమైన దృశ్యాలను వెంటతీసుకొచ్చిన తమ కెమెరాలో బంధించారు. గంగానదికి హూగ్లీ ఉపనది. ‘‘గంగానది అనేది ప్రతి ఒక్క బెంగాళీ మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది. బెంగాల్ ఆత్మలో గంగానదీ సజీవంగా పారుతుంది. యావత్ మానవ నాగరికత స్ఫూర్తిని ఈ పవిత్ర నదీజలాలు వెంట తీసుకొచ్చాయి. ఈరోజు ఉదయం కోల్‌కతాలో హూగ్లీ నది హొయలను నా కెమెరా కంటితో చూశా. కొన్ని జ్ఞాపకాలను ఫొటోలుగా కెమెరాలో బంధించా. విద్యాసాగర్ సేతు, ప్రఖ్యాత హౌరా వంతెనను పడవలో ప్రయాణిస్తూ దగ్గర్నుంచి తిలకించి ముగ్ధుడినయ్యా. హూగ్లీ నదీతీరంలో కాసేపు గడిపి గంగామాత రుణం తీర్చుకునే సదవకాశం సంపాదించా’’అని అన్నారు. తాను తీసిన ఫొటోలను తర్వాత మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.


