రసవత్తరంగా మారిన ప్లే ఆఫ్స్‌ సమీకరణలు | IPL 2026: play off scenario after match 56 | Sakshi
Sakshi News home page

రసవత్తరంగా మారిన ప్లే ఆఫ్స్‌ సమీకరణలు

May 13 2026 11:46 AM | Updated on May 13 2026 12:05 PM

IPL 2026: play off scenario after match 56

ఐపీఎల్‌ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, ప్లే ఆఫ్స్‌ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. సీజన్‌ ప్రారంభంలో చెలరేగి ఆడిన జట్లు ప్రస్తుతం మెత్తబడగా.. అడపాదడపా ప్రద‍ర్శనలతో ప్రారంభించిన జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి.

దశ తిరగబడి, అనూహ్యంగా పుంజుకున్న జట్ల జాబితాలో గుజరాత్‌ టైటాన్స్‌  ముందుంది. ఈ జట్టు రెండు వరుస పరాజయాలతో సీజన్‌ ప్రారంభించి, ఆతర్వాత హ్యాట్రిక్‌ విజయాలు, ఆతర్వాత మళ్లీ రెండు వరుస పరాజయాలు, వాటి తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, ప్రస్తుతం పాయింట్ట పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 

సీజన్‌ ప్రారంభంలో ఏమాత్రం అంచనాలు లేని గుజరాత్‌ ఒక్కసారిగా టైటిల్‌ ఫేవరెట్‌గా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో (కేకేఆర్‌, సీఎస్‌కే) ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారరవుతుంది. 

గుజరాత్‌ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 అపజయాలతో 16 పాయింట్లు కూడగట్టుకుంది. ఈ జట్టు రన్‌రేట్‌ (0.551) కూడా మెరుగ్గా ఉంది.

అంచనాలు తల్లకిందులైన జట్లలో పంజాబ్‌, రాజస్థాన్‌ ముందువరుసలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సీజన్‌ ప్రారంభంలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌-2 జట్లుగా చలామణి అయ్యాయి. అయితే అనూహ్యంగా ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌ రేసులో వెనుకపడ్డాయి. వీటిలో పంజాబ్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అపజయం కూడా ఎదుర్కోలేదు. అయితే ఆతర్వాత అనూహ్యంగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయంపాలై, నాలుగో స్థానానికి పడిపోయింది. 

తద్వారా ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంకటంలో పడేసుకుంది. ఇకపై ఆడబోయే 3 మ్యాచ్‌ల్లో (ముంబై, ఆర్సీబీ, లక్నో) కనీసం రెండైనా గెలవకపోతే పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ అశలను వదులుకోవాల్సిందే. 

పంజాబ్‌ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 4 అపజయాలతో 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్‌ లభించింది. నాలుగు వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, రన్‌రేట్‌ (0.428) ఇంకా మెరుగ్గానే ఉండటం పంజాబ్‌కు ఊరట కలిగించే విషయం.

ఆరంభంలో అదరగొట్టి, ఆతర్వాత ఢిలా పడిపోయిన మరో జట్టు రాజస్థాన్‌. ఈ జట్టు సీజన్‌ ప్రారంభంలో నాలుగు వరుస విజయాలు సాధించి, ఆతర్వాత 7 మ్యాచ్‌ల్లో కేవలం​ రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి, ప్లే ఆఫ్స్‌ రేసులో బాగా వెనుకపడిపోయింది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో (ఢిల్లీ, లక్నో, ముంబై) కనీసం రెండైనా గెలవకపోతే, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. 

ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఈ జట్టు 6 విజయాలు సాధించి, 5 అపజయాలు ఎదుర్కొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. రన్‌రేట్‌ (0.082) మెరుగ్గానే ఉంది.

హ్యాట్రిక్‌ పరాజయాలు.. హ్యాట్రిక్‌ విజయాలు
ఈ సీజన్‌లో అనూహ్యంగా ప్లే ఆఫ్స్‌ రేసులోకి వచ్చిన జట్టు సీఎస్‌కే. ఈ జట్టు హ్యాట్రిక్‌ పరాజయాలతో సీజన్‌ ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. చివరి 8 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ విజయాలు సహా 6 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. 

ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా ఈ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది. సీఎస్‌కేకు రన్‌రేట్‌ (0.185) కూడా మెరుగ్గా ఉండటం కలిసొచ్చే అంశం. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 అపజయాలు నమోదు చేసి, ప్లే ఆఫ్స్‌ రేసులో బలంగా నిలబడింది.

ప్లే ఆఫ్స్‌ రేసులో స్థిరంగా కొనసాగుతున్న మరో రెండు జట్లు ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్‌. సీజన్‌ ప్రారంభం నుంచి స్థిరంగా రాణిస్తున్న ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొని 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ జట్టు రన్‌రేట్‌ అన్ని జట్లకంటే మెరుగ్గా (1.103) మెరుగ్గా ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో (కేకేఆర్‌, పంజాబ్‌, ఎస్‌ఆర్‌హెచ్‌) రెండు గెలిస్తే సునాయాసంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ కన్ఫర్మ్‌ చేసుకుంటుంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (14 పాయింట్లు, 0.331 రన్‌రేట్‌) కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్‌లు (సీఎస్‌కే, ఆర్సీబీ) గెలిస్తే, మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. 

అధికారికంగా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్న మరో రెండు ఢిల్లీ క్యాపిటల్స్‌, కేకేఆర్‌. ఈ రెండు జట్లు టెక్నికల్‌గా ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. ఢిల్లీతో పోలిస్తే కేకేఆర్‌కు కాస్త మెరుగైన అవకాశాలే ఉన్నా, అది కూడా అంత ఈజీ కాదు. 

ప్రస్తుతం కేకేఆర్‌ ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌ రేసులో ఉంటుంది. ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో ఓడినా లీగ్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతుంది. ఇప్పటివరకు లక్నో, ముంబై ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement