
Photo Courtesy: BCCI
ఐపీఎల్ పునఃప్రారంభం తర్వాత ఇవాళ (మే 18) రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో రికార్డుల రారాజు, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న ఓ భారీ టీ20 రికార్డు బద్దలయ్యే ప్రమాదముంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 33 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా విరాట్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు.
విరాట్‌కు ఈ ఘనత సాధించేందుకు 243 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. రాహుల్‌కు 214వ ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ వచ్చింది. నేటి మ్యాచ్‌లో రాహుల్ 8000 పరుగులు పూర్తి చేస్తే, విరాట్ రికార్డుతో పాటు మరో రికార్డు కూడా సొంతమవుతుంది. యావత్ టీ20ల్లో అతి తక్కువ 8000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఘనత విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 213 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..
క్రిస్ గేల్- 213 ఇన్నింగ్స్‌లు
బాబర్ ఆజమ్- 218 ఇన్నింగ్స్‌లు
కాగా, ఈ సీజన్‌లో రాహుల్ వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసినప్పటికీ పర్వాలేదనిపించాడు. ఈ సీజన్‌లో రాహుల్ ఓసారి ఓపెనింగ్, రెండు మ్యాచ్‌ల్లో మూడో స్థానం, ఏడు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 47.63 సగటున, 142.63 స్ట్రయిక్‌రేట్‌తో 381 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రాహుల్ 10వ స్థానంలో ఉన్నాడు.
ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే నేడు గుజరాత్‌తో జరుగబోయే మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అత్యంత కీలకం. ప్రస్తుతం 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో (ఓ మ్యాచ్ రద్దైంది) 13 పాయింట్లు సాధించిన ఢిల్లీ పట్టికలో ఐదు స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం రెండు గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఇవాళ గుజరాత్‌ను ఢీకొట్టబోయే ఢిల్లీ.. ఆతర్వాతి మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ (మే 21), పంజాబ్ కింగ్స్‌తో (మే 24) తలపడాల్సి ఉంది. నేటి మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్ రేసులో ఉండే ఢిల్లీ.. తదుపరి ముంబై, పంజాబ్‌తో జరుగబోయే మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంటుంది.