
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. తొలుత తమ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండరని (డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకాల కోసం) ప్రకటించిన ఆ క్రికెట్ బోర్డు, తాజాగా మనసు మార్చుకున్నట్లు సమాచారం. లీగ్ పూర్తయ్యే వరకు (జూన్ 3) వారి ఆటగాళ్లు సంబంధిత ఫ్రాంచైజీలతో ఉండేందుకు క్రికెట్ సౌతాఫ్రికా అంగీకరించినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.
ఈ ప్రచారం నిజమైతే ఫ్రాంచైజీలకు సగం టెన్షన్ వదిలినట్లే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మంది డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఎనిమిది మందిలో ఆరుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్, స్టబ్స్) ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్‌లో ముందున్నాయి. ఈ ఆరుగురు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోతే సంబంధిత ఫ్రాంచైజీలు భారీగా నష్టపోతాయి.
చక్రం తిప్పిన ఫ్రాంచైజీ యజమానులు
క్రికెట్ సౌతాఫ్రికా ఆథ్వర్యంలో నడిచే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. తాజా పరిస్థితి నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పాయి. వారు క్రికెట్ సౌతాఫ్రికాతో మాటామంతి జరిపి ఆ దేశ ఆటగాళ్లను ప్లే ఆఫ్స్ పూర్తయ్యే వరకు కొనసాగేందుకు ఒప్పించినట్లు తెలుస్తుంది.
కాగా, రీ షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ సౌతాఫ్రికా తమ ఆటగాళ్లను ముందుగా అనుకున్నట్లు మే 26వ తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పడంతో క్రికెట్ సౌతాఫ్రికా తమ సన్నాహకలను (డబ్ల్యూటీసీ ఫైనల్) వాయిదా వేసుకుంది. జూన్ 3 తర్వాతే వాటి షెడ్యూల్‌ను ప్లాస్ చేసుకుంది.
ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు చెందిన సౌతాఫ్రికా ఆటగాళ్లు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారు)..
కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)
మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)
లుంగి ఎంగిడి (ఆర్సీబీ)
కగిసో రబాడ (గుజరాత్)
ర్యాన్ రికెల్టన్ (ముంబై)
ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.