IPL 2024- SRH: నితీశ్‌ రెడ్డి.. పక్కా లోకల్‌! త్వరలోనే టీమిండియాలో.. | Sakshi
Sakshi News home page

IPL 2024- SRH: నితీశ్‌ రెడ్డి.. పక్కా లోకల్‌! త్వరలోనే టీమిండియాలో..

Published Sun, May 19 2024 5:01 PM

IPL 2024: SRH Nitish Kumar Reddy Inspiring Journey, Interesting Facts

సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌. హైదరాబాద్‌కు చెందిన యువ బ్యాటర్‌ క్రీజ్‌లో ఉన్నాడు. ఆల్‌టైమ్‌ స్పిన్‌ దిగ్గజాల్లో ఒకడైన అశ్విన్‌ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌పై పడింది. బలంగా బాదితే వైడ్‌ లాంగాన్‌ దిశగా సిక్సర్‌! ఆ తర్వాత లెగ్‌స్పిన్నర్‌ చహల్‌ వచ్చాడు. 

టి20 క్రికెట్‌ స్టార్లలో ఒకడిగా, 350 వికెట్లు తీసిన అనుభవం అతనిది. వరుసగా ఫోర్, సిక్సర్‌! అంతటితో ఆగిపోలేదు. మరో రెండు బంతుల విరామం తర్వాత అదే ఓవర్లో వరుసగా మళ్లీ సిక్స్, ఫోర్‌.. కొద్ది సేపటికి అశ్విన్‌ తిరిగొచ్చాక వరుస బంతుల్లో మళ్లీ రెండు భారీ సిక్సర్లు! 

ఎక్కడా ఎలాంటి తడబాటు లేదు. పొరపాటున బ్యాట్‌ చివర తగిలి బంతి స్టాండ్స్‌లోకి వెళ్లింది కాదు. పూర్తిగా సాధికారికంగా, సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఆడిన షాట్లతో అతను ఆయా బంతులను సిక్సర్లుగా మలిచాడు. 

ఎంతో అనుభవం ఉన్న సీనియర్‌ తరహాలో అతను ఆడిన తీరు, అగ్రశ్రేణి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న శైలి.. మాజీ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు అతని గురించి మాట్లాడుకునేలా చేసింది. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా అతనిపై ప్రశంసల జల్లు కురిసింది. ఆ కుర్రాడే కె. నితీశ్‌ కుమార్‌ రెడ్డి. 

విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల నితీశ్‌ తాజా ఐపీఎల్‌లో తన ఆటతో అందరినీ ఆకర్షించాడు. అటు బ్యాటింగ్‌లో చెలరేగుతూ, ఇటు బౌలింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీయడమే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా చురుకైన ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 

ఆరేళ్ల క్రితమే జూనియర్‌ స్థాయి క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు సాధించి తన రాకను ఘనంగా చాటిన నితీశ్‌ ఇప్పుడు సీనియర్‌ ఇండియా క్రికెట్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.ఐపీఎల్‌లో ఒక అచ్చమైన తెలుగబ్బాయి ఆటను చూసి ఎంత కాలమైంది! 

హైదరాబాద్‌ టీమ్‌ దక్కన్‌ చార్జర్స్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి సన్‌రైజర్స్‌ వరకూ మనవాళ్ల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అటు ఆంధ్ర నుంచి గానీ, ఇటు హైదరాబాద్‌ నుంచి గానీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకుండా చాలా సందర్భాల్లో బయటి ఆటగాళ్లతోనే లోకల్‌ టీమ్‌ను ఫ్రాంచైజీ నడిపిస్తూనే ఉంది. ఏ సగటు క్రికెట్‌ అభిమానిని అడిగినా ఇదే చెబుతాడు. 

టీమ్‌లోకి తీసుకున్నా తుది జట్టులో ఆడించకుండా, ఒక్క మ్యాచ్‌ కూడా ఇవ్వకుండా సాగిన రోజులే ఎక్కువ. అక్కడక్కడా ఎవరైనా బరిలోకి దిగినా.. వాహ్‌ అనిపించే గుర్తుంచుకోదగ్గ ప్రదర్శనలూ తక్కువే. ఇలాంటి స్థితిలో నితీశ్‌ను అందరూ రెండు రాష్ట్రాల ప్రతినిధిగా, తమవాడిగా అభిమానిస్తున్నారు. అతను కూడా తన అద్భుత ఆటతో అందరి నమ్మకాన్ని నిలబెడుతూ కొత్త సంచలనంలా మారాడు. 

అలా మొదలై..
నితీశ్‌లోని సహజ ప్రతిభే అతడిని బ్యాటింగ్‌లో రాటుదేలేలా చేసింది. చాలా మందిలాగే నితీశ్‌ తండ్రి ముత్యాల రెడ్డి కూడా అబ్బాయి అల్లరిని భరించలేక ఆరేళ్ల వయసులో వేసవి శిక్షణ  శిబిరంలో చేర్పించడంతో మైదానంలో అతని ఆట మొదలైంది. ఆపై అబ్బాయి ఆసక్తి, నేర్చుకోవాలనే పట్టుదల వెరసి పూర్తి స్థాయిలో తండ్రి అతడిని క్రికెట్‌ శిక్షణ వైపు మళ్లించేలా చేసింది.

 కోచ్‌ల పర్యవేక్షణలో రాటుదేలిన నితీశ్‌ చిన్న వయసులోనే తనలోని అపార ప్రతిభను ప్రదర్శిస్తూ వచ్చాడు. అండర్‌–12 స్థాయికి వచ్చేసరికి గమ్యం స్పష్టమైపోయింది. అప్పటికే అతని బ్యాటింగ్‌లో స్ట్రోక్‌ మేకింగ్, పట్టుదల చూసినవారికి భవిష్యత్తులో ఉత్తమ క్రికెటర్‌ కావాల్సిన లక్షణాలున్నాయని అర్థమైంది. 

ఈ క్రమంలోనే అప్పటి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ డైరెక్టర్, భారత మాజీ ఆటగాడు ఎమ్మెస్కే ప్రసాద్‌ దృష్టి కూడా నితీశ్‌పై పడింది. ట్రయల్స్‌లో అతని ప్రతిభను చూసిన ఎమ్మెస్కే కడపలోని ఏసీఏ అండర్‌–14 అకాడమీలో చేరే అవకాశం కల్పించారు. అక్కడి నుంచి నితీశ్‌కు 24 గంటలూ క్రికెట్టే జీవితంగా మారిపోయింది. తన ఆటను మరింత సానబెట్టుకునే అవకాశం దక్కిన చోట కష్టపడిన అతను మరింత రాటుదేలాడు. 

మరో వైపు వైజాగ్‌ జింక్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉన్న తండ్రి ముత్యాల రెడ్డికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయింది. తాను అక్కడికి వెళితే బిడ్డ భవిష్యత్తుకు ఇబ్బంది రావచ్చని భావించిన ఆయన ఏకంగా తన ఉద్యోగానికే రాజీనామా ఇచ్చేశారు. పూర్తి స్థాయిలో కొడుకుకు అండగా ఉండి సరైన మార్గనిర్దేశనంలో నడిపించారు. 

పరుగుల వరద పారించి..
నితీశ్‌ కెరీర్‌లో 2017–18 దేశవాళీ సీజన్‌ హైలైట్‌గా నిలిచింది. 14 ఏళ్ల నితీశ్‌ అండర్‌–16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో ఆంధ్ర జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్లపై చెలరేగిన 8 ఇన్నింగ్స్‌లలోనే ఏకంగా 176.71 సగటుతో రికార్డు స్థాయిలో 1237 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. ఇందులో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. 

అన్నింటికి మించి నాగాలాండ్‌తో జరిగిన పోరులో అతను సాధించిన క్వాడ్రూపల్‌ సెంచరీ హైలైట్‌గా నిలిచింది. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ ప్రీక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో నితీశ్‌ 366 బంతులు ఎదుర్కొని 60 ఫోర్లు, 7 సిక్సర్లతో 441 పరుగులు సాధించడం విశేషం. ఇదే జోరును కొనసాగిస్తూ అండర్‌–19 టోర్నీ వినూ మన్కడ్‌ ట్రోఫీలో కూడా ఆకట్టుకున్న అతను బీసీసీఐ చాలెంజర్‌ టోర్నీలోనూ అవకాశం దక్కించుకున్నాడు. 

అదే జోరులో 17 ఏళ్ల వయసులో ఆంధ్ర తరఫున తొలి సీనియర్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కింది. ఒంగోలులో జరిగిన కేరళతో జరిగిన మ్యాచ్‌లో రంజీ ట్రోఫీలో అతను అరంగేట్రం చేశాడు. తర్వాతి సీజన్‌లో విజయ్‌హజారే వన్డే టోర్నీలో అడుగు పెట్టిన నితీశ్‌కు కొన్నాళ్ల తర్వాత ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలోనూ ఆంధ్రకు ఆడే అవకాశం దక్కింది. 

ప్రతికూల పరిస్థితులను దాటి..
అండర్‌–19 స్థాయిలో ఆకట్టుకున్నా.. అక్కడి నుంచి సీనియర్‌ స్థాయికి చేరే క్రమంలో యువ క్రికెటర్లంతా ఒక రకమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. రెండింటి మధ్య ఉండే అంతరం కారణంగా అంచనాలను అందుకోలేక వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది. దాదాపు అందరు ఆటగాళ్లు ఈ పరిస్థితిని ఎదుర్కొంటారు. నితీశ్‌కు కూడా ఇలాగే జరిగింది. 

జూనియర్‌ స్థాయి మెరుపుల తర్వాత కొంత కాలం పాటు అతను ఇదే స్థితిని అనుభవించాడు. రంజీ అరంగేట్రం తర్వాత ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో పాటు కోవిడ్‌ వల్ల వచ్చిన విరామం, ఇతర వేర్వేరు కారణాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. ఈ దశలో అతను తన ఆటకు మరో రూపంలో పదును పెట్టాడు. 

అప్పటి వరకు వేర్వేరు వయో విభాగాల్లో ఓపెనర్‌గా భారీగా పరుగులు సాధించి అప్పుడప్పుడు మీడియం పేస్‌ బౌలింగ్‌ చేసిన నితీశ్‌ ఇప్పుడు తన బౌలింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టాడు. అది 2022–23 రంజీ సీజన్‌లో బ్రహ్మండంగా పని చేసింది. 8 మ్యాచ్‌లలో 25 వికెట్లు పడగొట్టి సత్తా చాటడంతో ఆంధ్ర టీమ్‌లో ఆల్‌రౌండర్‌గా అతనికి గుర్తింపు దక్కింది. 

ఇదే క్రమంలో 2023–24 సీజన్‌లో పూర్తి స్థాయి ప్రదర్శనతో రెగ్యులర్‌గా టీమ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ ఏడాది కూడా అతను మళ్లీ 25 వికెట్లతో చెలరేగడంతో పాటు గతంలోలాగా బ్యాటింగ్‌లో కూడా తన పదును చూపించడం విశేషం. 

ఐపీఎల్‌లో అదరగొట్టి..
‘నితీశ్‌కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటికి నాకు మరో 25 ఏళ్ల సర్వీస్‌ ఉంది. ఆ సమయంలో నేను అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ హతాశులయ్యారు. సహజంగానే ఆ తర్వాత ఎన్నో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. మేమందరం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. 

అయితే వాటి ప్రభావం అబ్బాయిపై పడరాదని భావించాం. అతడి ఆటకు మాత్రం ఇబ్బంది రాకుండా అన్నీ చూసుకున్నాం. అసలు ఆటల గురించి ఏమాత్రం అవగాహన లేని నా భార్య మానస కూడా కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేసి శ్రమించింది. ఇప్పుడు అతడిని ఐపీఎల్‌లో చూస్తుంటే మాకెంతో గర్వంగా ఉంది’ భావోద్వేగంతో ముత్యాల రెడ్డి నాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.

నితీశ్‌ గత ఏడాదే సన్‌రైజర్స్‌ టీమ్‌తో పాటు ఉన్నాడు. కానీ ఆడిన రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌ అవకాశమే రాకపోగా, బౌలింగ్‌లోనూ వికెట్లు దక్కలేదు. అప్పుడు కొంత నిరాశకు గురైనా.. ఈసారి దక్కిన అవకాశాన్ని అతను అద్భుతంగా వాడుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లో చెలరేగుతూ రైజర్స్‌ టీమ్‌లో కీలకంగా మారాడు.

‘చిన్నప్పుడే నితీశ్‌లో ప్రతిభను గుర్తించాం. ఆపై సరైన అవకాశాలు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి. ఐపీఎల్‌లో అతని ఆట చూస్తే సంతోషం కలుగుతోంది. ఒత్తిడిలోనూ ఎక్కడా తడబాటుకు, ఆందోళనకు గురికాని అతని ఆత్మవిశ్వాసం నాకు నచ్చుతుంది. ఇప్పుడు అతను కెరీర్‌ కీలక దశలో ఉన్నాడు. 

బ్యాటింగ్‌ అద్భుతంగా చేస్తున్నాడు. బౌలింగ్‌లో స్టోక్స్, పాండ్యా తరహాలో మీడియం పేస్‌తోనే వేరియేషన్లు ప్రదర్శించడం, బంతిని ఇరు వైపుల స్వింగ్‌ చేయడం వంటివి మెరుగుపరచుకుంటే మంచి ఆల్‌రౌండర్‌గా త్వరలోనే టీమిండియాకు ఆడగలడు’ అని ఎమ్మెస్కే ప్రసాద్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనలాగే సగటు తెలుగు క్రికెట్‌ అభిమానులదీ అదే కోరిక. త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం.
-మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

Advertisement
 
Advertisement
 
Advertisement