Jake Fraser: కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్‌..! | Sakshi
Sakshi News home page

IPL 2024 DC VS MI: మ్యాడ్‌ మ్యాన్‌ జేక్‌ ఫ్రేసర్‌.. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్‌..!

Published Sat, Apr 27 2024 4:54 PM

IPL 2024 DC VS MI: Jake Fraser Has Fourth And Fifth Highest Percentage Of Runs In Boundaries In An IPL Innings

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 27) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనింగ్‌ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో జేక్‌ పడిన బంతిని పడినట్లు చితక బాదాడు. కొడితే బౌండరీ లేకపోతే సిక్సర్‌ అన్నట్లు జేక్‌ ఇన్నింగ్స్‌ సాగింది.

ముంబై బౌలర్ల అదృష్టం కొద్ది జేక్‌ పియూశ్‌ చావ్లా బౌలింగ్‌లో నబీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. లేకపోతే ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పడరాని పాట్లు పడాల్సి వచ్చేది. ఔట్‌ కాక ముందు జేక్‌ ఊపు చూస్తే క్రిస్‌ గేల్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు కూడా బద్దలయ్యేలా కనిపించింది. ఈ మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన జేక్‌.. ఈ సీజన్‌లో ఈ ఘనత సాధించడం ఇది రెండోసారి. సన్‌రైజర్స్‌తో జరిగిన తన అరంగ్రేటం మ్యాచ్‌లోనూ జేక్‌ 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. 

95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో..
జేక్‌ ఇన్నింగ్స్‌లో ఆసక్తికర విషయమేమిటంటే.. అతను చేసిన 84 పరుగుల స్కోర్‌లో 95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. అంటే జేక్‌ సాధించిన 84 పరుగుల్లో 80 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారా వచ్చాయి. కేవలం 4 పరుగులు మాత్రమే సింగిల్స్‌ రూపంలో వచ్చాయి. జేక్‌ ఇదే సీజన్లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలోనే (90 శాతానికి పైగా పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో) రెచ్చిపోయాడు.

ఆ మ్యాచ్‌లో జేక్‌ చేసిన 65 పరుగుల్లో 62 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. ఐపీఎల్‌లో అత్యధిక శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించిన రికార్డు మిస్టర్‌ ఐపీఎల్‌ సురేశ్‌ రైనా పేరిట ఉంది. 2014 సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా తాను చేసిన 87 పరుగుల్లో 84 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించాడు. తన 87 పరుగుల ఇన్నింగ్స్‌లో బౌండరీలు, సిక్సర్ల శాతం 96.55గా ఉంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ.. 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181పరుగులు చేసింది. జేక్‌ (84), అభిషేక్‌ (36), షాయ్‌ హోప్‌ (41) ఔట్‌ కాగా.. పంత్‌ (16), స్టబ్స్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

ఈ సీజన్‌లో జేక్‌ చేసిన స్కోర్లు..

- 55(35).
- 20(10).
- 65(18).
- 23(14).
- 84(27).

Advertisement
Advertisement