అతడి సేవలను సన్‌రైజర్స్‌ సరిగ్గా వాడుకోవడం లేదు! మద్దతు లేదనిపిస్తోంది: భారత మాజీ పేసర్‌

IPL 2023 SRH Vs RCB Umran Malik Not Handled Well By SRH: Zaheer Khan - Sakshi

IPL 2023 SRH: టీమిండియా యువ సంచలనం, కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సేవలను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుందని భారత మాజీ స్టార్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ అన్నాడు. లోపం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదని వాపోయాడు. కాగా నెట్‌ బౌలర్‌గా సన్‌రైజర్స్‌ జట్టులో చేరిన ఉమ్రాన్‌..‌ తన అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు.


Photo Credit : IPL Website

నెట్‌ బౌలర్‌గా వచ్చి..! ఏకంగా టీమిండియాలో
కచ్చితమైన వేగంతో బంతులు విసిరే ఈ స్పీడ్‌స్టర్‌ ఐపీఎల్‌-2021 సీజన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌ ద్వారా రైజర్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది 14 ఇన్నింగ్స్‌లో 22 వికెట్లు పడగొట్టిన అతడు.. అదే ఏడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఉమ్రాన్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఏడు మ్యాచ్‌లు ఆడిన అతడు 5 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్‌ 29 నాటి మ్యాచ్‌ తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు.

కెప్టెన్‌కే తెలియదట
ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2023లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు రైజర్స్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ మాట్లాడుతూ.. ఉమ్రాన్‌ ఆడకపోవడం వెనుక కారణమేమిటో తెలియదని వ్యాఖ్యానించాడు. మార్కరమ్‌ తీరు పలు సందేహాలకు తావిచ్చింది. ఈ క్రమంలో జియో సినిమా షోలో జహీర్‌ ఖాన్‌ ఈ విషయంపై స్పందించాడు.

ఉమ్రాన్‌ విషయంలో సన్‌రైజర్స్‌ ఎందుకిలా?!
‘‘సన్‌రైజర్స్‌ ఫ్రాంఛైజీ ఉమ్రాన్‌ సేవలను సరిగ్గా వాడుకోలేకపోతోంది. ఇందుకు కారణమేమిటో మాత్రం తెలియడం లేదు. యువ సీమర్లను జట్టులో ఉంచుకున్నపుడు.. వారికి అవసరమైన సమయంలో అన్ని రకాలుగా మద్దతుగా నిలబడాలి. 

లోపాలను సరిచేసుకునేందుకు సరైన వ్యక్తితో మార్గదర్శనం చేయించాలి. కానీ దురదృష్టవశాత్తూ ఉమ్రాన్‌ విషయంలో ఫ్రాంఛైజీ ఇవేమీ చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఈ సీజన్‌లో అతడి ఆట తీరు, పలు మ్యాచ్‌లకు పక్కన పెట్టిన విధానం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది’’ అని జహీర్‌ ఖాన్‌ చెప్పుకొచ్చాడు. 

వాళ్లిద్దరు సూపర్‌
ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ, హైదరాబాదీ స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ పవర్‌ ప్లేలో అద్భుతాలు చేస్తున్నారని జహీర్‌ కొనియాడాడు. పెద్దగా కష్టపడకుండా బ్యాటర్లను తిప్పలు పెడుతూ అనుకున్న ఫలితాలు రాబడుతున్నారంటూ షమీ, సిరాజ్‌లను కొనియాడాడు.

కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసిన షమీ.. పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. ఇక సిరాజ్‌ 13 మ్యాచ్‌లలో 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్‌ ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ ఓడిపోయి పదో స్థానంలో కొనసాగుతోంది.

చదవండి: రూ. 8 కోట్లు పెడితే మధ్యలోనే వదిలివెళ్లాడు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దు!
ఇది క్రికెట్‌ షోనా? లేదంటే.. అర్ధ నగ్న ఫొటోలు చూపిస్తూ..! సిగ్గుండాలి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top