IPL 2023 Points Table After 1st Phase Of Matches - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2023 తొలి దశ పూర్తైంది.. ఏ జట్టు ఏ స్థానంలో ఉంది..?

Apr 26 2023 11:39 AM | Updated on Apr 26 2023 11:50 AM

IPL 2023 Points Table After 1st Phase Matches - Sakshi

ఐపీఎల్‌-2023 తొలి దశ మ్యాచ్‌లు నిన్నటితో (ఏప్రిల్‌ 25) పూర్తయ్యాయి. లీగ్‌లో పాల్గొంటున్న మొత్తం 10 జట్లు ఇప్పటివరకు ఏడేసి మ్యాచ్‌లు ఆడాయి. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (0.662) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్‌ సైతం 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ, చెన్నైతో పోలిస్తే కాస్త తక్కువ రన్‌రేట్‌ (0.580) ఉన్న కారణంగా రెండో స్థానంలో నిలిచింది.

7 మ్యాచ్‌ల్లో తలో 4 విజయాలు సాధించిన రాజస్థాన్‌ రాయల్స్‌ (0.844), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (0.547), ఆర్సీబీ (-0.008), పంజాబ్‌ కింగ్స్‌ (-0.162) వరుసగా 3 నుంచి 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి.  7 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన ముంబై (-0.620) ఏడులో, 7 మ్యాచ్‌ల్లో తలో 2 మ్యాచ్‌ల్లో నెగ్గిన కేకేఆర్‌ (-0.186), సన్‌రైజర్స్‌ (-0.725), ఢిల్లీ క్యాపిటల్స్‌ (-0.961) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. 

2 గ్రూపులుగా 10 జట్లు..
ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పాల్గొంటున్న 10 జట్లు 2 గ్రూపులుగా విభజించబడ్డాయి. అన్ని జట్లు సొంత మైదానంలో 7 మ్యాచ్‌లు, ప్రత్యర్ధి సొంత వేదికలపై 7 మ్యాచ్‌లు ఆడతాయి. ఓ జట్టు ఇతర గ్రూప్‌లోని ప్రతి జట్టుతో రెండేసి మ్యాచ్‌లు (ఇంట, బయట) ఆడుతుంది. అలాగే సొంత గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. 

ఐపీఎల్‌ టీమ్‌లు.. గ్రూపులు

గ్రూప్‌ ఏ: ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌

గ్రూప్‌ బి: చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌

టాప్‌లో ఉండే నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు..
ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడిన అనంతరం లీగ్‌ మ్యాచ్‌లు పూర్తవుతాయి (మే 21). పాయింట్ల పట్టికలో టాప్‌ ఫోర్‌లో ఉండే జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మొదటి క్వాలిఫయర్‌లో (మే 23).. మూడు, నాలుగు స్థానాల్లో ఉండే జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో (మే 24) తలపడతాయి. క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్‌-2లో (మే 26) పోటీపడుతుంది. ఇక్కడ గెలిచిన జట్టు మే 28న క్వాలిఫయర్‌-1లో గెలిచిన జట్టుతో ఫైనల్‌ మ్యాచ్‌ ఆడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement