IPL 2023: పంజాబ్‌ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌న్యూస్‌

IPL 2023: No NOC For Bairstow But Livingstone Available For PBKS - Sakshi

మరో వారం రోజుల్లో(మార్చి 31న) ఐపీఎల్‌ 16వ సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌కు ఏకకాలంలో గుడ్‌న్యూస్‌.. బ్యాడ్‌న్యూస్‌ వచ్చాయి. గుడ్‌న్యూస్‌ ఏంటంటే విధ్వంసకర ఆల్‌రౌండర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్‌వోసీ క్లియరెన్స్‌ ఇచ్చింది. అదే సమయంలో మరో ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌ స్టోకు మాత్రం ఇంకా ఎన్‌వోసీ క్లియరెన్స్‌ ఇవ్వలేదు. దీంతో బెయిర్‌ స్టో ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆడేది అనుమానమే.

ఇంగ్లండ్‌కే చెందిన మరో స్టార్‌ క్రికెటర్‌ సామ్‌ కరన్‌ మాత్రం పంజాబ్‌ కింగ్స్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకెక్కిన సామ్‌ కరన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.18.25 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అక్టోబర్‌లో మ్యాచ్‌ సందర్భంగా కాలు విరగడంతో బెయిర్‌ స్టో ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకొని కోలుకున్నాడు.

ప్రస్తుతం ఈసీబీ పర్యవేక్షణలో ఉన్న బెయిర్‌ స్టో ఇంకా ఫిట్‌నెస్‌ సాధించలేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌కు ఎన్‌వోసీ ఇవ్వడానికి ఈసీబీ నిరాకరించింది. దీంతో అతను ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న యాషెస్‌ సిరీస్‌ వరకు బెయిర్‌ స్టో అందుబాటులోకి వస్తాడని ఈసీబీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక డిసెంబర్‌ 2022లో జరిగిన మినీ వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ బెయిర్‌ స్టోను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇక గతేడాది పాకిస్తాన్‌తో రావల్పిండి టెస్టు అనంతరం మోకాలి గాయంతో ఆటకు దూరమైన లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌ ఇతన్ని రూ. 11.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత లంకాషైర్‌ తరపున కౌంటీ క్రికెట్‌ ఆడాడు. ఈసీబీ ఎన్‌వోసీ క్లియరెన్స్‌ ఇచ్చినప్పటికి లివింగ్‌స్టోన్‌ ఎప్పుడు వస్తాడనే దానిపై క్లారిటీ లేదు.

మరోవైపు సామ్‌ కరన్‌ మాత్రం ఐపీఎల్‌ 2023 సీజన్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతనితో పాటు జోఫ్రా ఆర్చర్‌(ముంబై ఇండియన్స్‌), బెన్‌ స్టోక్స్‌(సీఎస్‌కే), మార్క్‌వుడ్‌(లక్నో సూపర్‌ జెయింట్స్‌) తదితరులు ఐపీఎల్‌ 16వ సీజన్‌లో పాల్గొననున్నారు.

IPL 2023లో ఇంగ్లండ్ ఆటగాళ్లు
సామ్ కరన్ (పంజాబ్ కింగ్స్), బెన్ స్టోక్స్ (చెన్నై సూపర్ కింగ్స్), హ్యారీ బ్రూక్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), ఫిల్ సాల్ట్ (ఢిల్లీ క్యాపిటల్స్), రీస్ టాప్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ఆదిల్ రషీద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జో రూట్ (రాజస్థాన్ రాయల్స్) , లియామ్ లివింగ్‌స్టోన్ (పంజాబ్ కింగ్స్), జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్), మొయిన్ అలీ (చెన్నై సూపర్ కింగ్స్), జోఫ్రా ఆర్చర్ (ముంబై ఇండియన్స్), జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), డేవిడ్ విల్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) మరియు మార్క్ వుడ్ (లక్నో సూపర్ జెయింట్స్)

చదవండి: క్యాన్సర్‌ మహమ్మారి నుంచి బయటపడిన టెన్నిస్‌ దిగ్గజం

మ్యాచ్‌ ఓడిపోయినా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top