ఏంటీ విభేదాలా? మహీ అన్న.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే: జడేజా ట్వీట్‌ వైరల్‌

IPL 2023: Mahi Bhai Aapke Liye Toh Kuch Bhi Jadeja Tweet Goes Viral - Sakshi

#MS Dhoni- Ravnidra Jadejaఐపీఎల్‌-2023 ఫైనల్‌.. అసలే వర్షం.. అప్పటికే ఓరోజు వాయిదా పడ్డ మ్యాచ్‌.. కనీసం రిజర్వ్‌ డే అయినా వరుణుడు కరుణిస్తాడా లేదా అన్న సందేహాలు.. పర్లేదు వాతావరణం బాగానే ఉంది.. ఆట మొదలైంది.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ భారీ స్కోరు సాధించింది.

సాయి అద్బుత ఇన్నింగ్స్‌
సాయి సుదర్శన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌(47 బంతుల్లో 96 పరుగులు) కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు స్కోరు బోర్డుపై ఉంచగలిగింది. అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు.

ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఫలితం ఏమవుతుందోనన్న ఆందోళన నడుమ అర్ధరాత్రి మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు అంపైర్లు. ఈ నేపథ్యంలో లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై గెలుపొందాలంటే 171 పరుగులు సాధించాలి.

కాన్వే అదరగొట్టాడు
సీజన్‌ ఆసాంతం అదరగొట్టిన సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(16 బంతుల్లో 26 పరుగులు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ డెవాన్‌ కాన్వే (25 బంతుల్లో 47 పరుగులు) శుభారంభమే అందించారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శివం దూబే తన వంతు పాత్ర పోషించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

ఇక నాలుగో స్థానంలో వచ్చిన అజింక్య రహానే 13 బంతుల్లోనే 27 పరుగులు సాధించాడు. ఆతర్వాతి స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అంబటి రాయుడు 8 బంతుల్లో 19 రన్స్‌ తీశాడు. అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ధోని గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగగా.. రవీంద్ర జడేజా మరోసారి మ్యాజిక్‌ చేశాడు. 

జడ్డూ విన్నింగ్‌ షాట్‌.. ఐదోసారి చాంపియన్‌గా చెన్నై
చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మోహిత్‌ శర్మ మొదటి నాలుగు బంతులు కట్టుదిట్టంగా వేశాడు. వరుసగా 0, 1,1,1.. మొత్తంగా మూడు పరుగులే వచ్చాయి. సీఎస్‌కే ఐదోసారి చాంపియన్‌గా నిలవాలంటే ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమయ్యాయి.

క్రీజులో జడేజా ఉన్నాడు. నరాలు తెగే ఉత్కంఠ.. పదిహేనో ఓవర్‌ ఐదో బంతిని సిక్సర్‌గా మలిచిన జడ్డూ.. ఆఖరి బంతికి ఫోర్‌ బాదాడు. విన్నింగ్‌ షాట్‌తో చెన్నైని ఫైవ్‌స్టార్‌ చేశాడు. అంతే.. సూపర్‌ కింగ్స్‌ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. సారథి ధోని అయితే ఏకంగా జడ్డూను ఎత్తుకుని మరీ సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

ఏంటీ విభేదాలా? మహీ అన్న కోసం ఏమైనా చేస్తా!
కీలక మ్యాచ్‌లలో చెన్నైని గెలిపించిన జడేజా.. ఐపీఎల్‌-2023 ఫైనల్లోనూ అద్భుతం చేసి జట్టును విజయతీరాలకు చేర్చి ధోనికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చాడు. కాగా ధోని- జడేజా మధ్య విభేదాలంటూ గత కొంతకాలంగా వదంతులు వ్యాపిస్తున్న తరుణంగా రవీంద్ర జడేజా తాజాగా చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

జడ్డూ, తన భార్య రివాబా ట్రోఫీతో ధోనితో కలిసి ఉన్న ఫొటో షేర్‌ చేస్తూ.. ‘‘ఇది కేవలం ఏకైక వీరుడు, ధీరుడు ఎంఎస్‌ ధోని కోసమే చేశాం. మహీ అన్నా.. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే’’ అంటూ ధోనిపై ప్రేమను కురిపించాడు. వేలల్లో రీట్వీట్లు, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో రవీంద్ర జడేజా ట్వీట్‌ దూసుకుపోతోంది.  వీరి మధ్య పొరపొచ్చాలు లేవని ఇప్పటికైనా ఇలా చెప్పారంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top