IPL 2022: పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌ చహల్‌, హసరంగ కూడా ఆ చెత్త జాబితాలో!

IPL 2022: Top 5 Bowlers Who Conceded Most Sixes Check Here - Sakshi

IPL 2022: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ అంటే క్రికెట్‌ ప్రేమికులకు ఎక్కడా లేని ఉత్సాహం. అభిమానులు ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తుంటే స్టేడియం ఈలలతో మారుమోగిపోవాల్సిందే! భారీ హిట్టర్లు, ఫ్యాన్స్‌కు ఇలా పండుగ చేసుకుంటే.. పాపం ఆ బ్యాటర్‌ ప్రతాపానికి బలైపోయిన బౌలర్‌ మాత్రం ఉసూరుమంటాడు. 

ఒక్క పరుగు కూడా ఫలితాన్ని తారుమారు చేయగల సందర్భాల్లో ఇలా జరిగితే ఆ బౌలర్‌ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొంతమందేమో వికెట్లు పడగొట్టినా పరుగులు ఎక్కువగా సమర్పించుకుని విమర్శల పాలవుతారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2022లో అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న టాప్‌-5 బౌలర్లు ఎవరో గమనిద్దాం!

1.మహ్మద్‌ సిరాజ్‌
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎంతో ఇష్టపడి మెగా వేలానికి ముందు రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లలో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఒకడు. అయితే, ఈ సీజన్‌లో అతడు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

ఐపీఎల్‌-2022లో 15 మ్యాచ్‌లు ఆడిన అతడు 514 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో 31 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఐపీఎల్‌ ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు ఇచ్చిన బౌలర్‌గా సిరాజ్‌ చెత్త రికార్డు తన పేరిట నమోదు చేసుకున్నాడు.

2. వనిందు హసరంగ
ఐపీఎల్‌-2022 సీజన్‌లో శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా 26 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌నకు అడుగు దూరంలో నిలిచిపోయాడు. 

అయితే, ఎక్కువ సిక్స్‌లు ఇచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆర్సీబీ తరఫున ఆడిన అతడు 16 మ్యాచ్‌లలో సిక్సర్ల రూపంలో 180 పరుగులు(30 సిక్స్‌లు) సమర్పించుకున్నాడు. మొత్తంగా 430 పరుగులు ఇచ్చాడు.

3. యజువేంద్ర చహల్‌
ఐపీఎల్‌-2022లో పర్పుల్‌ క్యాప్‌ విన్నింగ్‌ బౌలర్‌ యజువేంద్ర చహల్‌. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌.. మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు. 

ఒక 4 వికెట్‌, 4 వికెట్‌హాల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతాబాగానే ఉన్నా ఐపీఎల్‌-2022లో తాను సమర్పించుకున్న 527 పరుగులలో 27 సిక్సర్ల రూపంలో ఉండటం గమనార్హం.

4. శార్దూల్‌ ఠాకూర్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 473 పరుగులు ఇచ్చి 15 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 23 సిక్సర్లు ఉన్నాయి. మెగా వేలంలో 10.75 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఢిల్లీ ఫ్రాంఛైజీ అంచనాలకు అనుగుణంగా ఈ సీమర్‌ రాణించలేదనే చెప్పాలి.

5. కుల్దీప్‌ యాదవ్‌
ఒకానొక దశలో పర్పుల్‌ క్యాప్‌ కోసం చహల్‌తో పోటీ పడ్డాడు ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌. ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో ఈ చైనామన్‌ స్పిన్నర్‌ 21 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 419 పరుగులు ఇచ్చాడు. ఇందులో 22 సిక్సర్ల రూపంలో ఇచ్చినవే. 

ఇక తనదైన శైలితో రాణించిన కుల్దీప్‌ యాదవ్‌ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. చాలా కాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జూన్‌ 9 నుంచి భారత్‌లో టీమిండియాతో టీ20 సిరీస్‌ ఆడనున్న దక్షిణాఫ్రికాతో పోరుకు అతడు సిద్ధమవుతున్నాడు.

చదవండి: Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top