IPL 2022: టైటాన్స్‌ విజయారంభం

IPL 2022: Gujarat Titans beat Lucknow Super Giants by five wickets - Sakshi

లక్నోపై 5 వికెట్లతో గెలుపు

నిప్పులు చెరిగిన షమీ

తెవాటియా మెరుపులు

ఐపీఎల్‌లో నేడు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X రాజస్తాన్‌ రాయల్స్‌

వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

ముంబై: కొత్త ఐపీఎల్‌ జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్‌ టైటాన్స్‌ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన పోరులో 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. దీపక్‌ హుడా (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుశ్‌ బదోని (41 బంతుల్లో 54; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు తీశాడు. అనంతరం గుజరాత్‌ టైటాన్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలిచింది. రాహుల్‌ తెవాటియా (24 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్‌ (21 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దంచేశారు.  

షమీ నిప్పులు
ఆట ఆరంభమైన క్షణాన్నే షమీ... లక్నో నెత్తిన పిడుగు వేశాడు. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ (0)ను తొలి బంతికే డకౌట్‌ చేశాడు. తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ డికాక్‌ (7)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇది చాలదన్నట్లు వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఎవిన్‌ లూయిస్‌ (10)ను శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. బౌలర్‌ వరుణ్‌ ఆరోన్‌ అయినప్పటికీ ఈ వికెట్‌ పతనంలో కచ్చితంగా క్రెడిట్‌ గిల్‌కే దక్కుతుంది. బౌన్సర్‌ను లూయిస్‌ పుల్‌ షాట్‌ ఆడగా బ్యాట్‌ అంచును తాకిన బంతి స్క్వేర్‌లెగ్‌ దిశగా గాల్లోకి లేచింది. సర్కిల్‌ లోపలి నుంచి ఏకంగా 25 గజాల దూరం పరుగెత్తిన గిల్‌ డైవ్‌చేసి క్యాచ్‌ అందుకున్నాడు. మళ్లీ షమీ తన వరుస ఓవర్లో మనీశ్‌ పాండే (6)ను బౌల్డ్‌ చేశాడు. ఐదు ఓవర్లయినా పూర్తవకముందే లక్నో 29 పరుగులకు 4 వికెట్లను కోల్పోయింది.

ఆదుకున్న హుడా, బదోని
షమీ (3–0–10–3) అద్భుతమైన స్పెల్‌కు కుదేలైన లక్నోను దీపక్‌ హుడా, ఆయుశ్‌ బదోని ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో సూపర్‌ జెయింట్స్‌ కోలుకుంది. ఈ క్రమంలో హుడా (36 బంతుల్లో) 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తయ్యింది. స్కోరు వేగం పుంజుకుంటున్న తరుణంలో హుడాను రషీద్‌ ఖాన్‌ ఎల్బీగా పంపాడు. తర్వాత కృనాల్‌ పాండ్యా (13 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు) అండతో బదోని (38 బంతుల్లో; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకం సాధించాడు. ఆరోన్‌ ఆఖరి ఓవర్లో భారీషాట్‌కు యత్నించి హార్దిక్‌ పాండ్యా చేతికి చిక్కాడు.  

తెవాటియా, మిల్లర్‌ ధనాధన్‌
టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ కూడా కష్టాలతోనే ఆరంభమైంది. చమీర దెబ్బకు గిల్‌ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. తన మరుసటి ఓవర్లో విజయ్‌ శంకర్‌ (4) నూ చమీర పెవిలియన్‌ చేర్చడంతో లక్నో శిబిరం లో ఒక్కసారిగా ఎక్కడలేని ఆనందం! ఈ దశలో ఓపెనర్‌ వేడ్‌ (30; 4 ఫోర్లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (33; 5 ఫోర్లు, 1 సిక్స్‌) స్కోరు బోర్డును కదిలించారు. 10 ఓవర్లలో 72/2తో మెరుగ్గా కనిపించిన గుజరాత్‌ వరుస ఓవర్లలో పాండ్యా, వేడ్‌ వికెట్లను కోల్పోయి ఓటమికి దగ్గరైంది. ఈ దశలో డేవిడ్‌ మిల్లర్, తెవాటియా జట్టుకు ఆపద్భాంధవులయ్యారు.

ఆఖరి 5 ఓవర్లలో 68 పరుగులు చేయాల్సి ఉండగా... దీపక్‌ హుడా వేసిన 16వ ఓవర్లో తెవాటియా 6, 4 కొడితే మిల్లర్‌ కూడా 4, 6 బాదేశాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఇదే జోరుతో తెవాటియా... రవి బిష్ణోయ్‌ వేసిన 17వ ఓవర్‌నూ ఆడుకున్నాడు. ఒక సిక్స్, 2 ఫోర్లతో ఆ ఓవర్లో కూడా 17 పరుగులు రావడంతో విజయసమీకరణం 18 బంతుల్లో 29 పరుగులుగా మారిపోయింది. 18వ ఓవర్లో మిల్లర్‌ను అవేశ్‌ అవుట్‌ చేయగా... అభినవ్‌ మనోహర్‌ క్రీజులోకి వచ్చాడు. ఆఖరి 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా... 19వ ఓవర్లో చమీర 9 పరుగులిచ్చాడు. చివరి ఓవర్లో మనోహర్‌ రెండు బౌండరీలు, తెవాటియా ఫోర్‌తో టైటాన్స్‌ విజయం సాధించింది.

స్కోరు వివరాలు
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) వేడ్‌ (బి) షమీ 0; డికాక్‌ (బి) షమీ 7; లూయిస్‌ (సి) గిల్‌ (బి) ఆరోన్‌ 10; పాండే (బి) షమీ 6; హుడా (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్‌ ఖాన్‌ 55; బదోని (సి) హార్దిక్‌ (బి) ఆరోన్‌ 54; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 21; చమీర (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1–0, 2–13, 3–20, 4–29, 5–116, 6–156.
బౌలింగ్‌: షమీ 4–0–25–3, ఆరోన్‌ 4–0–45–2, ఫెర్గూసన్‌ 4–0– 24–0, హార్దిక్‌ 4–0–37–0, రషీద్‌ ఖాన్‌ 4–0–27–1.

గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) హుడా (బి) చమీర 0; వేడ్‌ (బి) హుడా 30; శంకర్‌ (బి) చమీర 4; హార్దిక్‌ (సి) పాండే (బి) కృనాల్‌ 33; మిల్లర్‌ (సి) రాహుల్‌ (బి) అవేశ్‌ 30; తెవాటియా (నాటౌట్‌) 40; అభినవ్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ ట్రా లు 9; మొత్తం (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1–4, 2–15, 3–72, 4–78, 5– 138.
బౌలింగ్‌: చమీర 3–0–22–2, అవేశ్‌ 3.4–0– 33–1, మోసిన్‌ 2–0–18–0, బిష్ణోయ్‌ 4–0–34– 0, కృనాల్‌ 4–0–17–1, హుడా 3–0– 31–1.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top