Venkatesh Iyer అందుకే ఆయనను కెప్టెన్ కూల్ అంటారు మరి!

Venkatesh Iyer shares experiences of meeting MS Dhoni: యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సీజన్ రెండో అంచెలో అద్భుతంగా రాణించాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి... ఫైనల్ చేరడంలో తన వంతు సాయం చేశాడు. ఈ సీజన్‌లో మొత్తంగా 10 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్.. 370 పరుగులతో సత్తా చాటాడు. ఈ క్రమంలో ఈ యువ ఆల్‌రౌండర్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా నెట్ బౌలర్‌గా అవకాశం ఇచ్చింది బీసీసీఐ.
ఈ విషయంపై స్పందించిన వెంకటేశ్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని, తనకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. శక్తిమేర రాణించి... భవిష్యత్తుకు బాటలు వేసుకుంటానని చెప్పుకొచ్చాడు. బీసీసీఐ తనకు ఎప్పుడు, ఎలాంటి అవకాశం ఇచ్చినా అందిపుచ్చుకుంటానని పేర్కొన్నాడు.
ఇక టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనితో మాట్లాడటం తన జీవితంలో గొప్ప విషయమని వెంకటేశ్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2021 సీఎస్‌కే- కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా... ధోనితో ముచ్చటించే అవకాశం వచ్చిందన్న వెంకటేశ్.. ఆయనను మిస్టర్ కూల్ అని ఎందుకు అంటారో అర్థమైందన్నాడు.
‘‘ఆయనను చూడగానే సంతోషంతో నాకు మాటలు రాలేదు. మైదానంలో ఆయన ఎలా ఉంటారు... ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూసే అవకాశం వచ్చింది. అందరూ ఆయన గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారో అలానే ఉంటారు. చాలా కూల్‌గా.. కామ్‌గా... ఆయన నిజంగా ‘‘కెప్టెన్ కూల్’’’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ధోని కెప్టెన్సీలోని సీఎస్‌కే ... ఐపీఎల్-2021 ఫైనల్‌లో కేకేఆర్‌ను ఓడించి నాలుగోసారి ట్రోఫీని గెలిచిన సంగతి తెలిసిందే.