కేకేఆర్‌ ఓపెనింగ్‌ జోడీని మార్చండి: గావస్కర్‌

IPL 2021 Sunil Gavaskar Suggests New Opening Pair for KKR - Sakshi

అహ్మదాబాద్‌: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ విఫలమవుతున్న నేపథ్యంలో కొత్త ఓపెనింగ్‌ జోడిని బరిలోకి దించితే బాగుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. సునీల్‌ నరైన్‌తో పాటు రాహుల్‌ త్రిపాఠి ఓపెనింగ్‌ చేస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేకేఆర్‌ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్‌ గిల్‌, కేవలం 89 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే 30 పరుగుల మార్కును దాటగలిగాడు.

ఇక సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ గిల్‌ మరోసారి విఫలమయ్యాడు. 8 బంతులు ఎదుర్కొన్న అతడు 9 పరుగులు మాత్రమే చేసి, షమీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో సునీల్‌ గావస్కర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... ‘‘గత కొన్నేళ్లుగా నితీశ్‌ రాణా కేకేఆర్‌ తరఫున మూడో స్థానంలో మైదానంలో దిగి, విజయవంతమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతడిని అదే స్థానంలో ఆడిస్తే బాగుంటుంది. కాబట్టి అతడి ప్లేస్‌లో రాహుల్‌ త్రిపాఠి లేదా సునీల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా పంపాలి. నిజానికి గిల్‌ కూడా పరుగులు చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. కాబట్టి, నరైన్‌- రాహుల్‌ త్రిపాఠి ఓపెనింగ్‌ చేస్తే బెటర్‌’’ అని చెప్పుకొచ్చాడు. కాగా నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్‌ పంజాబ్‌పై 5 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే.

చదవండి: శివం మావి వ్యాఖ్యలు.. డేల్‌ స్టెయిన్‌ భావోద్వేగం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top