Shreyas Iyer: ఆ నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ఇప్పుడు కూడా

IPL 2021: Shreyas Iyer Says It Was Difficult To Adapt Fact He Was Injured - Sakshi

Shreyas Iyer Comments: గాయం కారణంగా ఐపీఎల్‌-2021 సీజన్‌ తొలి దశకు దూరమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌.. పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. రెండో అంచెలో భాగంగా బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులతో (41 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో టాప్‌ స్కోరర్‌గా నిలిచి.. ఢిల్లీ విజయంలో ఈ మాజీ కెప్టెన్‌ తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం ఐపీఎల్‌ అధికారిక వెబ్‌సైట్‌తో శ్రేయస్‌ ముచ్చటించాడు.

ఈ సందర్భంగా.. గాయం తాలూకు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. ‘‘నేను గాయపడ్డాడన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అసలు గాయాల గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. అలాంటిది అకస్మాత్తుగా గాయపడటం మనసుకు కష్టంగా అనిపించింది. అయితే, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నన్ను చాలా బాగా చూసుకున్నారు. త్వరగా కోలుకునేలా తమ వంతు సాయం చేశారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా ప్రోత్సహించారు’’ అని చెప్పుకొచ్చాడు.

అదే విధంగా... ‘‘రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్లిన తర్వాత క్రమంగా కోలుకున్నాను. అక్కడ అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. సానుకూల వాతావరణం ఉంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా మారడానికి దోహదం చేసింది’’ అని శ్రేయస్‌ చెప్పుకొచ్చాడు. ఇక తాజా ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే నా పరుగుల దాహం తీరలేదు. ఈ ఇన్నింగ్స్‌ నాకు అంతగా సంతృప్తినివ్వలేదు. ప్రతీ మ్యాచ్‌లోనూ మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు.

కాగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లు 47 పరుగులు చేసిన అయ్యర్‌.. ఐపీఎల్‌లో 4 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌.. సిరీస్‌తో పాటు ఐపీఎల్‌ ఫేజ్‌ వన్‌ కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి స్థానంలో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఢిల్లీ పగ్గాలు చేపట్టాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ అద్భుత విజయాలు సాధించిన నేపథ్యంలో.. శ్రేయస్‌ తిరిగి వచ్చినప్పటికీ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని ఫ్రాంఛైజీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

చదవండి: MI Vs KKR: కేకేఆర్‌తో అంత ఈజీ ఏం కాదు.. గతం ఎలా ఉన్నా: రోహిత్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top