అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. నాకు నమ్మకం ఉంది!

IPL 2021 Rohit Sharma About Piyush Chawla Inclusion Mumbai Indians - Sakshi

ముంబై: వెటరన్‌ బౌలర్‌ పియూష్ చావ్లా వంటి అనువజ్ఞుడైన ఆటగాడు తమ జట్టులో ఉండటం ఎంతో ప్రయోజనకరమని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకు బలంగా నిలుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. కాగా గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించిన పియూష్ చావ్లాను మినీ వేలం-2021లో భాగంగా ముంబై ఇండియన్స్‌  కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2.40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ స్పిన్నర్‌ను సొంతం చేసుకుంది. అయితే, అప్పటికే జట్టులో రాహుల్‌ చహర్‌, జయంత్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా వంటి బౌలర్లు ఉండగా, పియూష్ కోసం పెద్ద మొత్తం వెచ్చించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 


పీయూశ్‌ చావ్లా(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

ఇక మరికొన్ని గంటల్లో ఆర్సీబీతో తొలి మ్యాచ్‌ ఆడనున్న ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ పరిణామాలపై స్పందిస్తూ.. ‘‘గత కొన్నేళ్లుగా పియూష్ ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అతడికి కొండంత అనుభవం ఉంది. తన నుంచి జట్టు ఏం కోరుకుంటుందో అతడికి బాగా తెలుసు. కచ్చితంగా అంచనాలను అందుకుంటాడనే భావిస్తున్నా. ఐపీఎల్‌లో ఇంతవరకు తను ఎన్నో వికెట్లు కూల్చాడు. తన చేరికతో మా జట్టు మరింత విలక్షణంగా మారింది. నిజానికి అండర్‌-19 జట్టులో పియూష్తో కలిసి ఆడాను. కాబట్టి తన గురించి నాకు బాగా తెలుసు. మా మధ్య ఉన్న స్నేహం మైదానంలోనూ ప్రస్ఫుటిస్తుంది’’ అంటూ పియూష్ ను జట్టులోకి తీసుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. 


ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(ఫొటో కర్టెసీ: ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియా)

ఇక ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 164 మ్యాచ్‌లు ఆడిన పియూష్ చావ్లా 7.87 ఎకానమీతో 156 వికెట్లు తీశాడు. కాగా నేడు ఎంఐ- ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. ఈ విషయం గురించి రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. జట్టులో కొత్త ఆటగాళ్లు చేరానని, తొలి మ్యాచ్‌ ఆడేందుకు ఆటగాళ్లంతా ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చాడు. దుబాయ్‌ ఫలితాలే పునరావృతం చేస్తామంటూ ఈసారి కూడా టైటిల్‌ తమదేనన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా ముంబై ఇప్పటివరకు ఐదుసార్లు విజేతగా నిలిచింది.

చదవండి: గా ముంబైల అందరు బ్యాట్స్‌మెన్లే.. ఎందర్నని ఔట్‌ జేయాల్రా!
IPL 2021: ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్‌ కాబోతోందా?!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top