IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు

Match Won By Last-ball Six IPL History.. క్రికెట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎంఎస్ ధోని ఆఖరిబంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు కప్ అందించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ ఒక్క సిక్స్ అభిమానుల్లో ధోని పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసింది. అలా లాస్ట్‌బాల్ సిక్స్ కొట్టడం అంతకముందు జరిగాయి.. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కీలక మ్యాచ్‌లో ఆఖరి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్‌లోనూ చాలానే చూశాం. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ ఇలాంటివే పునరావృతమవుతున్నాయి. అందులో ఒక మూడు మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోతాయి. అవేంటో చూద్దాం.
కెఎస్ భరత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2021
Courtesy: IPL Twitter
తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి ఆర్‌సీబీకి ఉత్కంఠ విజయాన్ని కట్టబెట్టాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. అయితే భరత్ మొదట డివిలియర్స్, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి ఇన్నింగ్స్ నడిపించాడు. ఇక ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ గెలుపుకు 15 పరుగులు అవసరమయ్యాయి. మొదటి ఐదు బంతుల్లో ఆవేశ్ ఖాన్ 9 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఒత్తిడిలో ఆవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో ఈక్వేషన్ ఒక బంతికి ఐదు పరుగులుగా మారింది. ఈ దశలో ఆవేశ్ ఖాన్ వేసిన లో ఫుల్‌టాస్‌ను భరత్ లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టి ఆర్‌సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్‌గా ఆర్‌సీబీ- డీసీ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో కేఎస్ భరత్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఎంఎస్ ధోని( రైజింగ్ పుణే సూపర్ జెయింట్, 2016)
Courtesy: IPL Twitter
ఎంఎస్ ధోని అంటే మొదటగా గుర్తుకు వచ్చే పదం మ్యాచ్ ఫినిషర్. అయితే ఎంఎస్ ధోని ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై ఆఖరిబంతికి సిక్స్ కొట్టి గెలిపించాడు. కానీ 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరపున పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ధోని సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఆ మ్యాచ్‌లో 173 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ధోనితో పాటు అశ్విన్ ఉన్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో ధోని స్ట్రైక్ తీసుకున్నాడు. తొలి బంతికి పరుగు రాలేదు. ఐదు బంతుల్లో 23 పరుగులు. అక్షర్ వైడ్ వేశాడు. అయితే ఆ తర్వాత అక్షర్ వేసిన నాలుగు బంతులను ధోని వరుసగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే పుణే విజయానికి ఆఖరి బంతికి సిక్స్ కావాలి. అక్షర్ పటేల్ ఫుల్ డెలివరీ వేశాడు. అంతే ధోని ఫ్రంట్‌ఫుట్ వచ్చి మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టడంతో రైజింగ్ పుణే జట్టులో సంబరాలు షురూ అయ్యాయి.
డ్వేన్ బ్రావో(చెన్నై సూపర్‌కింగ్స్, 2012)
Courtesy: IPL Twitter
ఐపీఎల్ చరిత్రలో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన తొలి బ్యాటర్‌గా డ్వేన్ బ్రావో నిలిచాడు. 2012లో లీగ్ దశలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. ధోనితో పాటు బ్రావో క్రీజులో ఉన్నాడు. రజత్ బాటియా వేసిన ఆఖరి ఓవర్‌లో తొలి బంతికి బ్రావో సింగిల్ తీశాడు. రెండో బంతికి ధోని బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేయడంతో సీఎస్‌కేకు ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో బాటియా వేసిన ఫుల్‌టాస్ డెలివరీని లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదడంతో సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు జరుపుకుంది.