ముంబై విజయనాదం | IPL 2020: Mumbai Indians Won The Match Against Sunrisers Hyderabad | Sakshi
Sakshi News home page

ముంబై విజయనాదం

Oct 5 2020 2:56 AM | Updated on Oct 5 2020 3:24 PM

IPL 2020: Mumbai Indians Won The Match Against Sunrisers Hyderabad - Sakshi

చిన్న మైదానం... డికాక్, కృనాల్‌ బ్యాటింగ్‌ మెరుపులు... బుమ్రా, బౌల్ట్‌ బౌలింగ్‌ విన్యాసాలు... వెరసి ఐపీఎల్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మూడో విజయాన్ని నమోదు చేసింది. ఎప్పటిలాగే మిడిలార్డర్‌ వైఫల్యం... ఒకరిద్దరిపైనే బ్యాటింగ్‌ భారం... ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ లేకపోవడం సన్‌రైజర్స్‌కు చేటు చేయగా... డెత్‌ ఓవర్లలో మరింత చెలరేగిన ముంబై బౌలర్లు జట్టుకు ఘనవిజయాన్ని అందించారు.   

షార్జా: అన్ని విభాగాల్లో అదరగొట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌లో మరో జబర్దస్త్‌ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రోహిత్‌ శర్మ బృందం 34 పరుగులతో చిత్తుగా ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. డికాక్‌ (39 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ (23 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించగా... కృనాల్‌ పాండ్యా (4 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో విధ్వంసం సృష్టించాడు. భువనేశ్వర్‌ స్థానంలో వచ్చిన సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌ను భర్తీ చేసిన సిద్ధార్థ్‌ కౌల్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ వార్నర్‌ (44 బంతుల్లో 60; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా తలా 2 వికెట్లు తీశారు.  

రోహిత్‌ ఔటైనా...  
భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ముంబై ఇండియన్స్‌ అదే రీతిలో చెలరేగింది. తొలి ఓవర్‌లోనే సిక్స్‌ కొట్టి దూకుడు మీదున్న రోహిత్‌ (6) వికెట్‌ను రివ్యూ ద్వారా రైజర్స్‌ దక్కించుకుంది. తర్వాత డికాక్‌తో కలిసి సూర్యకుమార్‌ (27; 6 ఫోర్లు) దూకుడు కనబరిచాడు. కౌల్‌ను లక్ష్యంగా చేసుకొని మూడు వరుస బౌండరీలతో కలిపి అతను మొత్తం 5 ఫోర్లు బాదాడు. చివరికి అతని బౌలింగ్‌లోనే నటరాజన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో పవర్‌ప్లేలో ముంబై 48/2తో నిలిచింది. 

డికాక్‌ దూకుడు... 
16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాంగాన్‌లో కఠినమైన క్యాచ్‌ను మనీశ్‌ పాండే వదిలేయడంతో బతికిపోయిన డికాక్‌ తర్వాత చెలరేగాడు. అతనికి ఇషాన్‌ కిషన్‌ చక్కని సహకారం అందించాడు. సమద్‌ బౌలింగ్‌లో 6, 4 బాదిన డికాక్‌... విలియమ్సన్‌ ఓవర్‌లో సిక్సర్‌తో అర్ధసెంచరీ సాధించాడు. ఇదే ఓవర్‌లో ఇషాన్‌ మరో సిక్స్‌ బాదడంతో మొత్తం 17 పరుగులు వచ్చాయి. వెంటనే మరో 4, 6 బాది ప్రమాదకరంగా మారుతోన్న డికాక్‌ను రషీద్‌ఖాన్‌ దొరకబుచ్చుకున్నాడు. దీంతో మూడో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరికాసేటికే పాండే అద్బుత క్యాచ్‌కు ఇషాన్‌ కిషన్‌ ఔటయ్యాడు.  
పాండ్యా బ్రదర్స్‌ జోరు... 
పొలార్డ్‌ (13 బంతుల్లో 25 నాటౌట్‌; 3 సిక్సర్లు )తో కలిసి పాండ్యా బ్రదర్స్‌ హార్దిక్, కృనాల్‌ చివరి 18 బంతుల్లో 49 పరుగులు సాధించారు. 18వ ఓవర్‌లో సందీప్‌ బౌలింగ్‌లో పొలార్డ్‌ రెండు సిక్సర్లు బాదగా... అంతకుముందే హార్దిక్‌ (19 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో రెండు సిక్సర్లతో చెలరేగాడు. వీరిద్దరూ కలిసి నటరాజన్‌ వేసిన 19వ ఓవర్లో 13 పరుగులు సాధించారు. చివరి ఓవర్లో హార్దిక్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కృనాల్‌ తాను ఎదుర్కొన్న చివరి నాలుగు బంతుల్లో వరుసగా 6, 4, 4, 6తో వీరవిహారం చేశాడు.  

వార్నర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌... 
మరోసారి రైజర్స్‌ బ్యాటింగ్‌ ఒక్కరిపైనే ఆధారపడింది. కెప్టెన్‌ వార్నర్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌న్‌ముంబై బౌలింగ్‌కు తలొంచారు. బెయిర్‌స్టో (25), మనీశ్‌ పాండే (30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), విలియమ్సన్‌ (3)లను కట్టడి చేసి ముంబై మ్యాచ్‌పై పట్టు సాధించింది. మరోవైపు 34 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన వార్నర్‌... జట్టు స్కోరు 142/4 వద్ద ఔట్‌ కావడంతో మ్యాచ్‌ ముంబై వశమైపోయింది. బుమ్రా, బౌల్ట్‌ లాంటి కట్టుదిట్టమైన బౌలింగ్‌కు యువ బ్యాట్స్‌మెన్‌ అభిషేక్‌ శర్మ (10), ప్రియమ్‌ గార్గ్‌ (8), సమద్‌ (20) చేతులెత్తేశారు. దీంతో రైజర్స్‌ ఓటమి ఖాయమైంది.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) బెయిర్‌స్టో (బి) సందీప్‌ 6; డికాక్‌ (సి అండ్‌ బి) రషీద్‌ ఖాన్‌ 67; సూర్యకుమార్‌ (సి) నటరాజన్‌ (బి) కౌల్‌ 27; ఇషాన్‌ కిషన్‌ (సి) మనీశ్‌ (బి) సందీప్‌ 31; హార్దిక్‌ (బి) కౌల్‌ 28; పొలార్డ్‌ (నాటౌట్‌) 25; కృనాల్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 208.
వికెట్ల పతనం: 1–6, 2–48, 3–126, 4–147, 5–188.
బౌలింగ్‌: సందీప్‌ 4–0–41–2, నటరాజన్‌ 4–0–29–0, సిద్ధార్థ్‌ కౌల్‌ 4–0–64–2, సమద్‌ 2–0–27–0, రషీద్‌ ఖాన్‌ 4–0–22–1, విలియమ్సన్‌ 2–0–24–0.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ఇషాన్‌ (బి) ప్యాటిన్సన్‌ 60; బెయిర్‌స్టో (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 25; మనీశ్‌ (సి) పొలార్డ్‌ (బి) ప్యాటిన్సన్‌ 30; విలియమ్సన్‌ (సి) డికాక్‌ (బి) బౌల్ట్‌ 3; ప్రియమ్‌ గార్గ్‌ (సి) రాహుల్‌ చహర్‌ (బి) కృనాల్‌ 8; అభిషేక్‌ శర్మ (బి) బుమ్రా 10; సమద్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 20; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 3; సందీప్‌ శర్మ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 174. 
వికెట్ల పతనం: 1–34, 2–94, 3–116, 4–130, 5–142, 6–168, 7–172.  
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–28–2, ప్యాటిన్సన్‌ 4–0–29–2, కృనాల్‌ పాండ్యా 4–0–35–1, బుమ్రా 4–0–41–2, పొలార్డ్‌ 3–0–20–0, రాహుల్‌ చహర్‌ 1–0–16–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement