పాండ్యా, క్రిస్‌ మోరిస్‌ మాటల యుద్ధం

IPL 2020 Hardik Pandya Chris Morris Verbal War MI Vs RCB - Sakshi

అబుదాబి: నువ్వా- నేనా అంటూ పోటీపడే సందర్భంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం ఎవరికైనా కాస్త కష్టమే. ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఇక క్రికెట్‌ వంటి క్రీడల్లో ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేందుకు, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి ఈ మాటల యుద్ధాలు శ్రుతిమించి తీవ్రవివాదాలకు దారి తీసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. తద్వారా అంపైర్ల ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకున్న ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు.(చదవండి కాస్త ఓపిక పట్టు సూర్యకుమార్‌: రవిశాస్త్రి)

ఇక ఐపీఎల్‌-2020 సీజన్‌లో భాగంగా తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ మధ్య వాగ్యుద్ధం జరిగింది. ముంబై విజయానికి చేరువవుతున్న తరుణంలో 19వ ఓవర్‌లో మోరిస్‌ వేసిన బంతిని సిక్స్‌గా మలిచిన పాండ్యా, అదే ఓవర్‌లోని ఐదో బంతికి మోరిస్‌ గాలానికి చిక్కాడు. భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. (చదవండి: మొదటి అడుగు ముంబైదే!)

ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ నేపథ్యంలో పాండ్యా, మోరిస్‌ ఇద్దరూ ప్రవర్తనా నియమావళి(లెవల్‌ 1- కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌)ని ఉల్లంఘించారని ఐపీఎల్‌ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంలో మ్యాచ్‌ రిఫరీదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. కాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, బెంగళూరుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌కు తోడు, బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ప్లేఆఫ్స్‌కు చేరువైంది.

  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top