అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంపైర్‌ సుధాకర్‌ కన్నుమూత

International Badminton Umpire Sudhakar Died - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా మూడు ఒలింపిక్స్‌లతోపాటు (1992 బార్సిలోనా, 1996 అట్లాంటా, 2000 సిడ్నీ) పలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో... ఆసియా క్రీడల్లో... కామన్వెల్త్‌ గేమ్స్‌లో.. థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌లలో అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వహించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంపైర్‌ వేమూరి సుధాకర్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో రెండు వారాలుగా కరోనా వైరస్‌తో పోరాడిన 70 ఏళ్ల సుధాకర్‌ మంగళవారం తుదిశ్వాస విడిచారు. సుధాకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నాలుగు దశాబ్దాలుగా బ్యాడ్మింటన్‌తో అనుబంధం కలిగిన సుధాకర్‌ ప్రస్తుతం ఆసియా బ్యాడ్మింటన్‌ టెక్నికల్‌ కమిటీకి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్‌ మృతిపట్ల తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు, ఐటీ, మునిసిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌... భారత బ్యాడ్మింటన్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు, డబుల్స్‌ స్టార్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, వెటరన్‌ కోచ్‌ ‘ద్రోణాచార్య’ ఎస్‌ఎం ఆరిఫ్, భారత బ్యాడ్మింటన్‌ సంఘం, ఆసియా బ్యాడ్మింటన్‌ సంఘం, భారత హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్‌మోహన్‌రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top