
‘నీరజ్ చోప్రా క్లాసిక్’ఈవెంట్ టైటిల్ కైవసం
‘హ్యాట్రిక్’నమోదు చేసుకున్న భారత స్టార్
బెంగళూరు: భారత్‌లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్... ‘నీరజ్ చోప్రా క్లాసిక్’లో భారత స్టార్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ‘ఎ’కేటగిరీ గుర్తింపునిచ్చిన ఈ టోర్నీలో శనివారం నీరజ్ జావెలిన్‌ను 86.18 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్ చోప్రాకు ఇది ‘హ్యాట్రిక్’టైటిల్ కావడం విశేషం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన నీరజ్... సొంతగడ్డపై అంచనాలను అందుకుంటూ అదరగొట్టాడు.
ప్రపంచ మాజీ చాంపియన్ జూలియన్ యెగో (84.51 మీటర్లు; కెన్యా), రమేశ్ పతిరగే (84.34 మీటర్లు; శ్రీలంక) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్ చోప్రా పర్యవేక్షణలో జరిగిన ఈ ఈవెంట్ విజయవంతం కాగా... విజేతలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహుమతులు అందజేశారు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో త్రోలో జావెలిన్‌ను 82.99 మీటర్ల దూరం విసిరాడు.
ఇక మూడో ప్రయత్నంలో ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నీరజ్ విజయనాదం చేశాడు. ఆ తర్వాత నాలుగో ప్రయత్నంలో మరోసారి ఫౌల్ చేసిన నీరజ్.. ఐదో ప్రయత్నంలో 84.07 మీటర్లు, ఆరో త్రోలో 82.22 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. మిగిలిన అథ్లెట్లెవరూ నీరజ్ దరిదాపుల్లోకి చేరుకోలేకపోవ డంతో భారత స్టార్ విజేతగా నిలిచాడు.