అనాహత్, అభయ్‌లకు టైటిల్స్‌ | Indian players won the titles at the Indian Open Squash Tournament | Sakshi
Sakshi News home page

అనాహత్, అభయ్‌లకు టైటిల్స్‌

Mar 23 2026 12:57 AM | Updated on Mar 23 2026 7:20 AM

Indian players won the titles at the Indian Open Squash Tournament

ముంబై: ఇండియన్‌ ఓపెన్‌ స్క్వాష్‌ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్లే టైటిల్స్‌ సాధించారు. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అనాహత్‌ సింగ్‌ మహిళల టైటిల్‌ చేజిక్కించుకుంది. పురుషుల ఈవెంట్‌లో అభయ్‌ సింగ్‌ నిలకడైన ఆటతీరుతో విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన అమ్మాయిల ఫైనల్లో యువ సంచలనం అనాహత్‌ 3–1 (11–5, 11–6, 9–11, 11–6)తో ఈజిప్టు క్రీడాకారిణి హనా మొతాజ్‌ను ఓడించింది. 

భారత ప్లేయర్‌ తొలి రెండు సెట్లను అలవోకగా గెలుచుకోగా... మూడో సెట్‌ను ఈజిప్టు అమ్మాయి దక్కించుకుంది. వెంటనే పుంజుకున్న అనాహత్‌ నాలుగో సెట్‌ నెగ్గి మ్యాచ్‌ను ముగించింది. గత నెలలో ఈ భారత ప్లేయర్‌ కెరీర్‌ బెస్ట్‌ ప్రపంచ 19వ ర్యాంకుకు ఎగబాకింది. ఇపుడు తాజా టైటిల్‌ విజయంతో టాప్‌–20 ర్యాంకింగ్స్‌లో నిలకడగా కొనసాగనుంది. 2022 ఆసియా క్రీడల్లో పతకం గెలిచిన అనాహత్‌... గతేడాది ప్రపంచ జూనియర్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో భారత్‌ 15 ఏళ్ల పతక నిరీక్షిణకు తెరదించింది. 

చెన్నైలో జరిగిన స్క్వాష్‌ ప్రపంచకప్‌లోనూ ఆమె బంగారు పతకంతో సత్తాచాటింది. భారత ఆటగాళ్ల మధ్యే జరిగిన పురుషుల ఫైనల్లో అభయ్‌ సింగ్‌ తన సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వరుస సెట్లలో గెలుపొందాడు. అతను 11–9, 11–8, 11–4 వీర్‌ చొత్రానిపై విజయం సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement