భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తొమ్మిది నిమిషాల నిడివితో కూడిన వీడియో సందేశం ద్వారా గురువారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా కువైట్‌తో జూన్ 6న జరిగే మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని సునిల్ ఛెత్రి తెలిపాడు. ‘‘గత 19 ఏళ్ల కాలంలో విధి నిర్వహణ, ఒత్తిడి.. సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నెమరువేసుకుంటూనే వచ్చాను.
దేశం కోసం నేను ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని అస్సలు ఊహించలేదు. మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్‌తో ఆడే మ్యాచ్ నా చివరి మ్యాచ్ అవుతుంది’’ అని సునిల్ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.
రొనాల్డో, మెస్సీ తర్వాత..
1984, ఆగష్టు 3న సికింద్రాబాద్‌లో జన్మించిన సునిల్ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్ బగాన్ క్లబ్ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు.
ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2005లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా జూన్ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్‌గా ఎదిగాడు.
మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఫుట్‌బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం.
అందుకున్న పురస్కారాలు
👉అర్జున అవార్డు
👉పద్మశ్రీ
👉ఖేల్‌రత్న
👉ఏఐఎఫ్‌ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు
👉మూడుసార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
👉శాఫ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ
Comments
Please login to add a commentAdd a comment