నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో వన్డే
గెలిస్తే సిరీస్ టీమిండియా ఖాతాలోకి
మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
రాజ్‌కోట్: సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో సత్తా చాటుతున్న భారత క్రికెట్ జట్టు... నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా... ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. టీమిండియాను గాయాల బెడద వెంటాడుతున్నా... విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ జట్టుకు కలిసి రానుంది. సిరీస్ ప్రారంభానికి ముందే రిషభ్ పంత్ గాయపడగా... తొలి మ్యాచ్ సందర్భంగా వాషింగ్టన్ సుందర్‌కు పక్కటెముకల గాయమైంది. దీంతో ఈ ఇద్దరూ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు.
సుందర్ స్థానంలో ఆయుశ్ బదోనీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే తుది జట్టులో స్థానం కోసం అతడు ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పోటీ పడాల్సి ఉంది. స్టార్ పేసర్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... గత మ్యాచ్‌లో మన పేసర్లు ఆకట్టుకున్నారు. కానీ స్పిన్నర్లే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మరి ఈ మ్యాచ్‌లో మన స్పిన్ బలగం ఆ లోటును పూడుస్తుందా చూడాలి. మరోవైపు తొలి వన్డేలో కొన్నిసార్లు ఆధిక్యంలో ఉన్నప్పటికీ దాన్ని చివరి వరకు కొనసాగించడంలో విఫలమైన న్యూజిలాండ్ జట్టు... తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్‌ను సమం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. పిచ్ అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌కు సమానంగా సహకరించనుంది.
ఆ ఇద్దరే అసలు బలం...
టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న రోహిత్ శర్మ, కోహ్లినే టీమిండియాకు ప్రధాన బలం. గత మ్యాచ్‌లో విరాట్ త్రుటిలో శతకం చేజార్చుకోగా... రోహిత్ శర్మ క్రీజులో ఉన్నంతసేపు తన షాట్‌లతో మెరిపించాడు. ఈ జోడీ మరోసారి చెలరేగితే... కివీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఇక కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తొలి వన్డేలో చక్కటి ఇన్నింగ్స్‌లతో కదంతొక్కారు.
టీమిండియా ఆడిన గత సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన గిల్... హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా... స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడగల శ్రేయస్ ఒక పరుగుతో అర్ధశతకానికి దూరమయ్యాడు. ఐదో స్థానంలో కుదురైన బ్యాటర్ కనిపించడం లేదు. సుందర్ స్థానంలో బదోనీ, నితీశ్‌లో ఒకరికి స్థానం దక్కుతుందా లేక ధ్రువ్ జురేల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడిస్తారా చూడాలి. హైదరాబాదీ సిరాజ్‌తో కలిసి అర్‡్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పేస్ భారాన్ని మోయనుండగా... రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
సమం చేయాలని...
గత మ్యాచ్‌లో తొలి వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ... ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించడంలో కివీస్ విఫలమైంది. కాన్వే, నికోల్స్ జట్టుకు శుభారంభాన్ని అందించినా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చినవాళ్లు దాన్ని కొనసాగించలేకపోయారు. మిచెల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో న్యూజిలాండ్ జట్టులో అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్, హే, బ్రేస్‌వెల్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో ఆరున్నర అడుగుల పొడగరి జేమీసన్ సత్తా చాటుతుండగా... ఫోల్‌్క్స, క్లార్క్ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న భారత సంతతి లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్‌పై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, నితీశ్ రెడ్డి/ఆయుశ్ బదోనీ, జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్, అర్‡్షదీప్, సిరాజ్. న్యూజిలాండ్: బ్రేస్‌వెల్ (కెప్టెన్), కాన్వే, నికోల్స్, యంగ్, మిచెల్, హే, ఫిలిప్స్, క్లార్క్, జెమీసన్, ఫోల్‌్క్స, ఆదిత్య అశోక్.
1. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచింది (2020లో ఆ్రస్టేలియాపై). మూడింటిలో (2013లో ఇంగ్లండ్ చేతిలో; 2015లో ఆ్రస్టేలియా చేతిలో; 2023లో ఆస్ట్రేలియా చేతిలో) ఓడిపోయింది.


