India vs England 2nd ODI: Dream11 India vs England 2nd ODI Prediction, Preview, Pitch Report, Weather Report - Sakshi
Sakshi News home page

మరొకటి గెలిస్తే... మూడోది మనదే!

Mar 26 2021 5:02 AM | Updated on Mar 26 2021 9:23 AM

India vs England 2nd ODI Today - Sakshi

ఆడిన రెండు ఫార్మాట్లను విజయంతో ముగించింది. మూడో ఫార్మాట్‌లో మొదటిది గెలిచి ముందంజలో నిలిచింది. ఇప్పుడు రెండో వన్డేతో ఈ మూడో సిరీస్‌ను గెలవాలనే లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు ఈ టైటిల్‌నూ అప్పగించొద్దనే పట్టుదలతో ఇంగ్లండ్‌ జట్టు చావోరేవోకు సిద్ధమైంది. తప్పక గెలవాల్సిన ఒత్తిడిలో, సిరీస్‌లో నిలవాలనే కసితో పర్యాటక జట్టు ఉంది.   

పుణే: జోరు మీదున్న భారత్‌ ఇప్పుడు రెండో వన్డేతోనే సిరీస్‌పై కన్నేసింది. పర్యాటక జట్టును రిక్తహస్తాలతోనే ఇంటిదారి పట్టించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు అన్నింటా దెబ్బతిన్న ఇంగ్లండ్‌ ఆఖరి సిరీస్‌తోనైనా స్వదేశానికి పయనం కావాలనుకుంటోంది. రెండో మ్యాచ్‌లో గెలిచి తుదిపోరుదాకా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే రసవత్తరంగా జరిగే అవకాశముంది. కోహ్లిసేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటే ..పర్యాటక జట్టు ఒత్తిడిలో ఉంది. కెప్టెన్‌ మోర్గాన్‌ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కావడం ఆ జట్టుకు మరో దెబ్బ.  

ఆల్‌రౌండ్‌ సత్తాతో...
టీమిండియా ఆల్‌రౌండ్‌ సత్తాతో దూసుకెళుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించే కుర్రాళ్లు అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్న ‘గబ్బర్‌’ ధావన్‌ టచ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చే అంశం. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ కూడా శిఖర్‌తో హిట్టయితే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. గత మ్యాచ్‌లో మోచేతి గాయానికి గురైన ‘హిట్‌మ్యాన్‌’ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. టాపార్డర్‌లో కోహ్లి, మిడిలార్డర్‌లో రాహుల్, పాండ్యా బ్రదర్స్‌ (హార్దిక్, కృనాల్‌)తో బ్యాటింగ్‌ ఆర్డర్‌ అత్యంత పటిష్టంగా క నిపిస్తోంది. గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. లేదంటే రిషభ్‌ పంత్‌పై నమ్మకముంచితే సూర్య అరంగేట్రం ఆలస్యం కావొచ్చు. బౌలింగ్‌లో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ ఒక్క వికెటైనా తీయకపోగా... 9 ఓవర్లలోనే ధారాళంగా 68 పరుగులివ్వడంతో కోహ్లి అతన్ని తప్పించి చహల్‌ను తుది జట్టులో ఆడించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.  

గెలిపించేదెవరు?  
తొలి టెస్టు మినహా ప్రతి మ్యాచ్‌లో, ప్రతీ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు సవాళ్లు, ఓటమిలే ఎదురవుతున్నాయి. పొట్టి సిరీస్‌లో మొదట హోరాహోరీగా తలపడిన ఇంగ్లండ్‌ తర్వాత భారత్‌తో ఢీకొనలేకపోయింది. ఇప్పుడు తొలి వన్డేలోనూ లక్ష్య ఛేదనలో టీమిండియాకు దీటుగా సాగిన ఇంగ్లండ్‌ అనంతరం చేతులెత్తేసింది. ఈ కష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ విజయసారథి మోర్గాన్‌ గాయంతో దూరమవడం జట్టును ఇబ్బందిపెట్టే అంశం. నెట్‌ ప్రాక్టీస్‌ కూడా చేయని కెప్టెన్‌ తదుపరి రెండు వన్డేలకు దూరమని జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఓపెనర్లు రాయ్, బెయిర్‌ స్టోలు సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరి మెరుపులకు స్టోక్స్, బట్లర్‌ చెలరేగితే తప్పకుండా ఈ వన్డే ఫలితం మారొచ్చు. సిరీస్‌లో సజీవంగా నిలవొచ్చు.

జట్లు (అంచనా):
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, పంత్‌/సూర్యకుమార్, రాహుల్, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, శార్దుల్, చహల్, ప్రసిధ్‌.
ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), రాయ్, బెయిర్‌ స్టో, మలాన్, స్టోక్స్, లివింగ్‌స్టోన్, మొయిన్, స్యామ్‌ కరన్, టామ్‌ కరన్, రషీద్, వుడ్‌/టోప్లీ.

పిచ్, వాతావరణం
పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గ ధామం. టాస్‌ గెలిచిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపేలా పిచ్‌ ఉంది. వర్షం ముప్పు లేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement