నిఖత్‌ పంచ్‌ అదిరె... | Sakshi
Sakshi News home page

నిఖత్‌ పంచ్‌ అదిరె...

Published Fri, Mar 24 2023 6:04 AM

India star in World Women's Boxing Championship final - Sakshi

న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు తమ పంచ్‌ పవర్‌ను ప్రదర్శించారు. ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షి ప్‌లో ఏకంగా నలుగురు భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), నీతూ (48 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) తుది పోరుకు అర్హత సాధించి స్వర్ణ పతకాలకు విజయం దూరంలో నిలిచారు.

గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో నిఖత్‌ జరీన్‌ 5–0తో 2016 రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఇన్‌గ్రిత్‌ వలెన్సియా (కొలంబియా)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–2తో ఆసియా చాంపియన్‌ అలువా బల్కిబెకోవా (కజకిస్తాన్‌)పై, లవ్లీనా 4–1తో లీ కియాన్‌ (చైనా)పై, స్వీటీ 4–3తో స్యు ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీపడి స్వర్ణం సాధించిన నిఖత్‌ ఈసారి 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ను ఓడించిన వలెన్సియాను నిఖత్‌ తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే పక్కా ప్రణాళికతో ఆడింది. రింగ్‌లో వేగంగా కదులుతూనే అవకాశం దొరికినపుడల్లా వలెన్సియాపై పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయించకుండా కూడా నిఖత్‌ జాగ్రత్త పడింది. ముందుగా తొలి రెండు రౌండ్‌లలో ఎదురుదాడి చేసి స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన నిఖత్‌ మూడో రౌండ్‌లో మాత్రం ప్రత్యర్థి కి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా రక్షణాత్మకంగా ఆడి కట్టడి చేసింది.  

2  ఒకే ప్రపంచ చాంపియన్‌షి ప్‌లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది భారత బాక్సర్లు ఫైనల్‌ చేరడం ఇది రెండోసారి. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచి్చన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదుగురు భారత బాక్సర్లు (మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ, లేఖ, నగిశెట్టి ఉష) ఫైనల్‌ చేరారు. ఉష రజతం నెగ్గగా, మేరీకోమ్, సరిత, జెన్నీ, లేఖ స్వర్ణ పతకాలు గెలిచారు. 

మేరీకోమ్‌ తర్వాత ప్రపంచ చాంపియన్‌షి ప్‌లో కనీసం రెండుసార్లు ఫైనల్‌కు చేరిన భారత బాక్సర్లుగా నిఖత్‌ జరీన్, స్వీటీ గుర్తింపు పొందారు. మేరీకోమ్‌ ఏకంగా ఏడుసార్లు ఫైనల్‌కు చేరి ఆరుసార్లు స్వర్ణం, ఒకసారి రజతం  సాధించింది. నిఖత్‌ గత ఏడాది, స్వీటీ 2014లో ఫైనల్‌కు చేరారు.

నేడు విశ్రాంతి దినం. శనివారం, ఆదివారం ఫైనల్స్‌ జరుగుతాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో లుత్సయిఖాన్‌ అల్టాంట్‌సెట్‌సెగ్‌ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్‌ (చైనా)తో స్వీటీ తలపడతారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్స్‌లో ఎన్గుయెన్‌ థి టామ్‌ (వియత్నాం)తో నిఖత్‌ జరీన్‌... కైట్లిన్‌ పార్కర్‌ (ఆ్రస్టేలియా)తో లవ్లీనా పోటీపడతారు. 


 

Advertisement
 
Advertisement
 
Advertisement