
India vs South Africa ODI Series: కెప్టెన్‌గా కోహ్లి భారత క్రికెట్ జట్టును శిఖరానికి తీసుకెళ్లాడు. వ్యూహ ప్రతివ్యూహాలే కాకుండా మైదానంలో అతను చూపించే దూకుడు, అమితోత్సాహం అభిమానులు ఎప్పుడూ మరచిపోలేరు. అయితే అన్ని ఫార్మాట్‌ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి, 2016 తర్వాత అతను ఒక ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగబోతున్నాడు. నాయకత్వ బాధ్యతలు లేకపోవడం కోహ్లి స్థాయిని తగ్గించకపోవచ్చు గానీ కొత్తగా మాత్రం కనిపించడం ఖాయం. మరోవైపు ముందు వైస్ కెప్టెన్‌గా ఎంపికై ఆ తర్వాత రోహిత్ శర్మ గైర్హాజరులో అదృష్టవశాత్తూ సారథిగా మారిన కేఎల్ రాహుల్ కొత్త పరీక్షకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే టెస్టు సిరీస్ కోల్పోయిన జట్టును అతను వన్డేల్లో విజేతగా నిలుపుతాడా అనేది ఆసక్తికరం.
పార్ల్: టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సమరానికి సమయం ఆసన్నమైంది. నేడు జరిగే తొలి పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత అందించే ‘వరల్డ్‌కప్ సూపర్ లీగ్’లో ఈ మూడు వన్డేలు భాగం కాకపోయినా... ఇటీవలే ముగిసిన హోరా హోరీ టెస్టు సిరీస్ కారణంగా ఈ మ్యాచ్‌లూ ఆసక్తి రేపుతున్నాయి. రాహుల్‌కు భారత జట్టు కెప్టెన్‌గా ఇదే తొలి వన్డే మ్యాచ్ కావడం విశేషం. విరాట్ కోహ్లి చివరిసారిగా 2016 అక్టోబరులో వైజాగ్‌లో జరిగిన భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డేలో కెప్టెన్ గా కాకుండా ఒక బ్యాటర్‌గా మాత్రమే (ధోని నాయకత్వంలో) బరిలోకి దిగాడు.
వెంకటేశ్‌కు చోటు!
సహజంగానే టెస్టు జట్టులో లేని కొందరు ‘స్పెషలిస్ట్’ ఆటగాళ్లు వన్డేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. భువనేశ్వర్, దీపక్ చహర్, చహల్, శిఖర్ ధావన్‌లతో జట్టు కొత్తగా కనిపించనుంది. ‘100 వికెట్ల క్లబ్’కు మరో 3 వికెట్ల దూరంలో ఉన్న లెగ్‌స్పిన్నర్ చహల్ మరోసారి సీనియర్ జట్టు తరఫున తన స్థాయిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉన్నాడు. రాహుల్‌తో పాటు ధావన్ ఓపెనింగ్ చేస్తాడు.
మూడో స్థానంలో కోహ్లి మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు. 2019 అక్టోబర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో శతకం సాధించని కోహ్లి ఇప్పుడు బ్యాటర్‌గా తన సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. ఆరో స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఉండాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. దాంతో భారత్ తరఫున 3 టి20లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: రాహుల్ (కెప్టెన్), ధావన్, కోహ్లి, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్, దీపక్ చహర్, భువనేశ్వర్, అశ్విన్, బుమ్రా, చహల్.