Trolls On Rohit Sharma: వైస్‌ కెప్టెన్‌ కాదు.. ముందు ఫిట్‌గా ఉండు.. కోహ్లితో పెట్టుకున్నావు.. ఇదో గుణపాఠం! అయినా ఆ స్కోర్లేంటి బాబూ!

Ind Vs SA: Fans Troll Rohit Sharma As He Misses South Africa Tour Due To Injury - Sakshi

Ind Vs SA Test Series- Trolls On Rohit Sharma: టీమిండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్‌ శర్మ.. ఆ హోదాలో ఆడనున్న తొలి సిరీస్‌కు దూరమవడాన్ని కొంత మంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. విదేశీ గడ్డపై ఆడాల్సివచ్చినపుడు ఏదోరకంగా జట్టుకు దూరమవడం అతడికి పరిపాటే అని విమర్శిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో ఆదివారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో రోహిత్‌ చేతికి స్వల్ప గాయమైంది. అయితే, దీని కారణంగానే అతడు సిరీస్‌ నుంచి తప్పుకొన్నాడని అంతా భావించారు. కానీ.. గతంలో ఇబ్బంది పెట్టిన తొడ కండరాల గాయం తిరగబెట్టినందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఏదేమైనా కీలక సిరీస్‌కు ముందు హిట్‌మ్యాన్‌ ఇలా గాయపడిన నేపథ్యంలో గతంలో ఇలాగే విదేశీ సిరీస్‌లకు దూరమైన విషయాన్ని, అదే విధంగా రోహిత్‌ ఫిట్‌నెస్‌ విషయం గురించి సోషల్‌ మీడియాలో చర్చకు తెరతీశారు నెటిజన్లు. ‘‘ 2014లో ఇంగ్లడ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు గాయపడ్డాడు.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కూడా ఇలాగే.. 2020 ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ సమయంలోనూ... ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా టూర్‌ నేపథ్యంలో కూడా... కీలక సిరీస్‌లకు ముందు గాయపడే ఏకైక క్రికెటర్‌ రోహిత్‌ శర్మ. విదేశీ సిరీస్‌లు తప్పించుకోవడానికి నువ్వు అనుసరిస్తున్న ట్రిక్‌ బాగుంది అని కొంతమంది సైటైర్లు వేస్తున్నారు.

ఇక విరాట్‌ కోహ్లి ఫ్యాన్స్‌ మాత్రం.. ‘‘కోహ్లితో పెట్టుకున్నావు.. నీ రాత ఇలాగ మారింది. రోహిత్‌ శర్మకు ఇదో పెద్ద గుణపాఠం.. ముందు ఫిట్‌నెస్‌ సాధించు. కోహ్లి ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా ఎప్పుడైనా సిరీస్‌లకు దూరమవడం చూశావా. నువ్వేమో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సారథిగా ప్రకటింపబడిన వెంటనే గాయపడ్డావు ’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. మరికొంత మంది.. దక్షిణాఫ్రికాలో రోహిత్‌ శర్మ గత పేలవ రికార్డులను ఉటంకిస్తూ.. అతడు సిరీస్‌కు దూరమవడమే మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

సౌతాఫ్రికాలో 4 టెస్టుల్లో రోహిత్‌ స్కోర్లు... 14, 6, 0, 25, 11, 10, 10, 47!   
దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్‌ 4 టెస్టులు ఆడాడు. వీటిలో అతని స్కోర్లు 14, 6, 0, 25, 11, 10, 10, 47 మాత్రమే! ఇది ఏ రకంగా చూసినా పేలవ ప్రదర్శనే. అయితే ఇదంతా అతను మిడిలార్డర్‌లో ఆడినప్పటి స్థితి. 2019లో సొంతగడ్డపై దక్షిణా ఫ్రికాతోనే ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్‌ టెస్టుల్లో ఒక్కసారిగా భీకర ఆటగాడిగా మారిపోయాడు. నాటి వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తూ అద్భుత షాట్లతో పాటు మెరుగైన స్ట్రయిక్‌రేట్‌తో ఆడుతూ జట్టుకు శుభారంభాలు అందించాడు. ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్‌ శర్మ 16 టెస్టుల్లో ఏకంగా 58.48 సగటుతో 1,462 పరుగులు సాధించాడు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి.

ఇటీవలి ఇంగ్లండ్‌ సిరీస్‌లో 2 అర్ధ సెంచరీలతో పాటు ఓవల్‌ టెస్టులో శతకం కూడా బాది ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన అతను తాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెలరేగిపోగలనని నిరూపించాడు. ముఖ్యంగా రబడ, నోర్జే, ఒలీవియర్, ఇన్‌గిడి, మార్కో జాన్సన్‌లాంటి మెరుపు పేసర్లను సఫారీ గడ్డపై అతను సమర్థంగా ఎదుర్కోగలడని అంతా నమ్మారు. ఇలాంటి స్థితిలో రోహిత్‌ లేకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారడం ఖాయం. రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌ రూపంలో ఇద్దరు సమర్థులైన ఓపెనర్లు ఉన్నా... రోహిత్‌లాంటి టాప్‌ బ్యాట్స్‌మన్‌ లేని లోటు మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది.
చదవండి: India Tour Of South Africa: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. టెస్ట్‌లకు స్టార్‌ ప్లేయర్‌ దూరం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top