Ind vs SA: రెండ్రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర | Sakshi
Sakshi News home page

Ind vs SA: దెబ్బకు దెబ్బ: రెండు రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర

Published Thu, Jan 4 2024 5:20 PM

Ind vs SA 2nd Test Day 2: India Beat South Africa By 7 Wickets Scripts History - Sakshi

South Africa vs India, 2nd Test- India won by 7 wkts: సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల  తేడాతో ఆతిథ్య జట్టుపై విజయఢంకా మోగించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. కాగా సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ గెలవాలనే సంకల్పంతో రోహిత్‌ సేన సౌతాఫ్రికాలో అడుగుపెట్టింది. 

బాక్సింగ్‌ డే టెస్టులో ఘోర పరాజయం
ఈ క్రమంలో సెంచూరియన్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో అనూహ్య రీతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇన్నింగ్స్‌ మీద 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. దీంతో సిరీస్‌ గెలవాలన్న ఆశలు అడియాసలు కాగా.. కనీసం డ్రా చేసుకుంటే చాలనే స్థితికి వచ్చింది టీమిండియా.

ఇలాంటి దశలో బుధవారం కేప్‌టౌన్‌లో రెండో టెస్టు ఆరంభించింది. ఈ క్రమంలో టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేసిన భారత జట్టు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసింది.

సీమర్లకు స్వర్గధామంగా భావించే న్యూలాండ్స్‌ పిచ్‌ మీద తొలి రోజే సఫారీల ఆట కట్టించింది. టీమిండియా పేసర్లలో మహ్మద్‌ సిరాజ్‌ ఏకంగా ఆరు వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. జస్‌ప్రీత్‌ బుమ్రా, ముకేశ్‌ కుమార్‌ చెరో రెండు వికెట్లు కూల్చారు. 

తొలి రోజే ఆధిక్యంలోకి టీమిండియా
ఈ క్రమంలో బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(39), శుబ్‌మన్‌ గిల్‌(36), విరాట్‌ కోహ్లి(46) మెరుగైన ఇన్నింగ్స్‌ కారణంగా 153 పరుగులు చేయగలిగింది. తద్వారా 98 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఓ చెత్త రికార్డు కూడా.. బుమ్రా ‘ఆరే’యడంతో
అయితే, 153 పరుగుల వద్దే వరుసగా ఆరు వికెట్లు కోల్పోయి ఓ చెత్త రికార్డు కూడా నమోదు చేసింది. ఈ క్రమంలో మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో 63/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో గురువారం ఆట మొదలుపెట్టిన సౌతాఫ్రికాను బుమ్రా కోలుకోలేని దెబ్బకొట్టాడు.

వరుస విరామాల్లో ఐదు వికెట్లు కూల్చి ప్రొటిస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. సెంచరీ హీరో మార్క్రమ్‌ రూపంలో సిరాజ్‌ కీలక వికెట్‌ దక్కించుకోగా.. ముకేశ్‌ కుమార్‌కు రెండు, ప్రసిద్‌ కృష్ణకు ఒక వికెట్‌ దక్కాయి. దీంతో 176 పరుగుల వద్ద సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ ముగిసిపోయింది.

తొలి ఆసియా జట్టుగా చరిత్ర
ఈ నేపథ్యంలో 79 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 12 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఛేదించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ సమం చేసుకోవడమే గాక.. కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్ర సృష్టించింది.

భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్‌ 28, శుబ్‌మన్‌ గిల్‌ 10, విరాట్‌ కోహ్లి 12 పరుగులు చేయగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 17, శ్రేయస్‌ అయ్యర్‌ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. మహ్మద్‌ సిరాజ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చదవండి: కేఎల్‌ రాహుల్‌ చేసిన తప్పు వల్ల.. మార్క్రమ్‌ సెంచరీ! తొలి సఫారీ బ్యాటర్‌గా..

Advertisement
Advertisement