IND Vs ENG 4th Test: అరుదైన ఫీట్‌ను సాధించిన హిట్‌ మ్యాన్‌.. దిగ్గజాల సరసన చేరిక

IND vs ENG: Rohit Sharma Completes 15000 International Runs, Joins Legends - Sakshi

ఓవల్: టీమిండియా డాషింగ్ ఓపెనర్, హిట్‌ మ్యాన్‌ రోహిత్ శర్మ అరుదైన ఫీట్‌ను సాధించి దిగ్గజ క్రికెటర్ల సరసన చేరాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ (56 బంతుల్లో 20 బ్యాటింగ్‌; 2 ఫోర్లు).. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన 8వ భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్(24,208), విరాట్ కోహ్లీ(22,999), సౌరవ్ గంగూలీ(18,575), ఎంఎస్ ధోనీ(17,266), వీరేంద్ర సెహ్వాగ్(17,253), మహమ్మద్ అజారుద్దీన్(15,593) రోహిత్(15,009) కన్నా ముందున్నారు.

ఓవరాల్‌‌గా 15వేల మైలురాయి దాటిన జాబితాలో రోహిత్‌ 39వ స్థానంలో నిలిచాడు. 227 వన్డేల్లో 9,205 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. 43 టెస్ట్‌ల్లో 2935, 111 టీ20ల్లో 2864 రన్స్ చేశాడు. ఈ ఫీట్‌తో రోహిత్‌ మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగవంతంగా 15 వేల క్లబ్‌లో చేరిన ఐదో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో కోహ్లీ(333 ఇన్నింగ్స్‌) అగ్రస్థానంలో ఉండగా.. సచిన్(356), ద్రవిడ్(368), సెహ్వాగ్(371) రోహిత్(397) కన్నా ముందున్నారు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. తొలి రోజు బౌలింగ్‌లో చెలరేగిన ఆతిథ్య జట్టు రెండో రోజు బ్యాటింగ్‌లో మొదట్లో తడబడినా ఆతర్వాత నిలదొక్కుకుంది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ(20), కేఎల్ రాహుల్(41 బంతుల్లో 22 నాటౌట్‌; 4 ఫోర్లు) ఉన్నారు.
చదవండి: ఔటయ్యానన్న కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొట్టాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top