శార్దూల్‌ ఠాకూర్‌తో పాటు అతడినీ ఆడించాల్సిందే: మాజీ క్రికెటర్లు | IND vs ENG 4th Test: Kaif Navjot Sanjay Bangar Picks Playing XI | Sakshi
Sakshi News home page

శార్దూల్‌ ఠాకూర్‌తో పాటు అతడినీ ఆడించాల్సిందే: మాజీ క్రికెటర్ల సూచనలు ఇవే

Jul 23 2025 2:12 PM | Updated on Jul 23 2025 3:57 PM

IND vs ENG 4th Test: Kaif Navjot Sanjay Bangar Picks Playing XI

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో కీలకమైన నాలుగో టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్ధమైంది. అయితే, ఇంగ్లండ్‌తో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో గాయాల బెడద వేధించడం ఆందోళన రేకెత్తిస్తోంది.  

పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఎడమ మోకాలి గాయం వల్ల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అదే విధంగా.. పేస్‌ బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆకాశ్‌ దీప్‌ గాయాల వల్ల మాంచెస్టర్‌ టెస్టు ఆడటం లేదు. దీంతో తుదిజట్టు కూర్పుపై ఇంత వరకు స్పష్టత రాలేదు.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు మహ్మద్‌ కైఫ్‌, సంజయ్‌ బంగర్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు, ఆకాశ​ చోప్రా, దీప్‌దాస్‌ గుప్తా తదితరులు తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించారు. లార్డ్స్‌లో మూడో టెస్టు ఆడిన జట్టులో కైఫ్‌ రెండు మార్పులు సూచించాడు.  గాయంతో సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి స్థానాన్ని శార్దూల్‌ ఠాకూర్‌తో భర్తీ చేస్తే బాగుంటుందన్నాడు.

అదే విధంగా.. పేస్‌ దళంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌లతో పాటు అన్‌క్యాప్డ్‌ పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ను ఆడించాలని సూచించాడు. ప్రసిద్‌ క్రిష్ణ కంటే అన్షుల్‌ బెటర్‌ ఆప్షన్‌ అని అభిప్రాయపడ్డాడు.

మరోవైపు.. సంజయ్‌ బంగర్‌ సైతం శార్దూల్‌ ఠాకూర్‌ను ఆడించాలని సూచించాడు. ఇప్పటికే జట్టులో ఉన్న ఇద్దరు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లతో పాటు శార్దూల్‌ కూడా ఉంటే లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.

అయితే, అన్షుల్‌ను కాకుండా అనుభవమున్న ప్రసిద్‌ కృష్ణను పేస్‌ దళంలో చేర్చాలని బంగర్‌ సూచించడం గమనార్హం. అయితే, కైఫ్‌, బంగర్‌లకు భిన్నంగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు మాత్రం శార్దూల్‌ ఠాకూర్‌ జట్టుకు అవసరం లేదంటూ కుండబద్దలు కొట్టాడు.

అదే విధంగా.. కరుణ్‌ నాయర్‌కు బదులు ధ్రువ్‌ జురెల్‌ను, ప్రసిద్‌ కృష్ణ లేదంటే అన్షుల్‌ కాంబోజ్‌లలో ఒకరిని జట్టులో చేర్చాలని సూచించాడు. మరోవైపు.. దీప్‌దాస్‌ గుప్తా మాత్రం కైఫ్‌ అభిప్రాయంతో ఏకీభవించాడు. నితీశ్‌ రెడ్డికి బదులు బ్యాటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌, ఆకాశ్‌ దీప్‌నకు బదులు అన్షుల్‌ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.

మహ్మద్‌ కైఫ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అన్షుల్‌ కాంబోజ్‌, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

సంజయ్‌ బంగర్‌ ఎంచుకున్న తుదిజట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్‌ కృష్ణ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

తుదిజట్టుపై నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు అంచనా
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్/ధ్రువ్‌ జురెల్‌, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్‌ కృష్ణ/అన్షుల్‌ కాంబోజ్‌, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

దీప్‌దాస్‌ గుప్తా ప్లేయింగ్‌ ఎలెవన్‌
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, అన్షుల్‌ కాంబోజ్‌, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

కాగా బుధవారం (జూలై 23) నుంచి భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్టు మొదలుకానుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానం ఇందుకు వేదిక. కాగా టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్‌ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement