IND VS ENG 1st Test: ఇంగ్లండ్‌ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌ | IND VS ENG 1st Test: List Of Records KL Rahul Broke With Century Vs England In Leeds | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test: ఇంగ్లండ్‌ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌

Jun 23 2025 9:31 PM | Updated on Jun 24 2025 7:39 AM

IND VS ENG 1st Test: List Of Records KL Rahul Broke With Century Vs England In Leeds

టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్‌ నేలపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో రాహుల్‌ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్‌ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేస్తూ ఈ రికార్డుతో పాటు మరిన్ని మైలురాళ్లను చేరుకున్నాడు.

47 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్‌.. 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం అనంతరం రాహుల్‌ 137 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా కరుణ్‌ నాయర్‌ (20) క్రీజ్‌లో ఉన్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్‌ స్కోర్‌ 332/4గా ఉంది. భారత్‌  338 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.

ఇదే ఇన్నింగ్స్‌లో మరో భారత ఆటగాడు రిషబ్‌ పంత్‌ (118) కూడా శతకొట్టాడు. పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీతో (134) మెరిశాడు. ఈ మ్యాచ్‌పై భారత్‌ పట్టు బిగించింది.

తాజా సెంచరీతో రాహుల్‌ సాధించిన రికార్డులు..
ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్‌ రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ తన కెరీర్‌లో 9 టెస్ట్‌ సెంచరీలు చేయగా.. అందులో ఆరు ఆసియా బయటే చేయడం​ విశేషం. భారత ఓపెనర్లలో సునీల్‌ గవాస్కర్‌ అత్యధికంగా ఆసియా బయట 15 సెంచరీలు చేశాడు. గవాస్కర్‌ తర్వాత రాహుల్‌ అత్యధికంగా 6, వీరేంద్ర సెహ్వాగ్‌ 4 సెంచరీలు చేశారు.

ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత్‌ ఓపెనర్లు..
కేఎల్‌ రాహుల్‌-3
విజయ్‌ మర్చంట్‌-2
సునీల్‌ గవాస్కర్‌-2
రవిశాస్త్రి-2
రాహుల్‌ ద్రవిడ్‌-2

  • లీడ్స్‌లో మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రెండో పర్యాటక ఓపెనర్‌గా రికార్డు. రాహుల్‌కు ముందు (1955) సౌతాఫ్రికాకు చెందిన జాకీ మెక్‌గ్లూ లీడ్స్‌లో మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.

  • ఇంగ్లండ్‌ గడ్డపై ఆరో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడు. ఈ సెంచరీతో రాహుల్‌ ఇంగ్లండ్‌పై మూడు సెంచరీలు చేసినట్లైంది. భారత ఆటగాళ్లలో రాహుల్‌ ద్రవిడ్‌ (6), సచిన్‌ టెండూల్కర్‌ (4), దిలీప్‌ వెంగసర్కార్‌ (4), రిషబ్‌ పంత్‌ (4) మాత్రమే ఇంగ్లండ్‌ గడ్డపై రాహుల్‌ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు. సౌరభ్‌ గంగూలీ రాహుల్‌తో సమానంగా 3 సెంచరీలు చేశాడు.

  • SENA దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు. ఈ విభాగంలో సచిన్‌ టెండూల్కర్‌ (17), విరాట్‌ కోహ్లి (12), రాహుల్‌ ద్రవిడ్‌ (10), సునీల్‌ గవాస్కర్‌ (8) రాహుల్‌ కంటే ముందున్నారు. రాహుల్‌తో సమానంగా మహ్మద్‌ అజారుద్దీన్‌ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 471, ఇంగ్లండ్‌ 465 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (101), శుభ్‌మన్‌ గిల్‌ (147), రిషబ్‌ పంత్‌ (134) సెంచరీలు చేయగా.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్‌ (106) సెంచరీతో కదంతొక్కాడు.  

హ్యారీ బ్రూక్‌ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్‌ కృష్ణ మూడు, సిరాజ్‌ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement