అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మే 19న ప్రకటించనుంది. ఈ సందర్భంగా అజిత్ అగార్కర్ అండ్ కో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అఫ్గాన్‌తో టెస్టుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.
వన్డేల్లో మాత్రం బుమ్రా ఆడనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రాహుల్ వంటి శ్రేయస్ అయ్యర్, వంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు.
భారత జట్టులోకి ఆకిబ్ నబీ!
ఇక దేశవాళీ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది. బుమ్రా గైర్హజారీలో మొహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను లీడ్ చేసే అవకాశముంది. అదేవిధంగా ఆకాష్ దీప్, హర్షిత్ ఇద్దరూ గాయపడటంతో ప్రసిద్ద్ కృష్ణ కూడా తిరిగి టెస్ట్ స్క్వాడ్‌లోకి రానున్నాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి బంతిని పంచుకోనున్నాడు.
భారత్ ఇద్దరు ఫ్రంట్‌లైన్ పేసర్లతోనే బరిలోకి దిగే అవకాశముంది. ఎందుకంటే ఉపఖండ పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు తుది జట్టులో ఉండడానికి అస్కారం ఉంది.
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా సిరీస్‌లో విఫలమైన దేవ్‌దత్త్ పడిక్కల్‌కు సెలక్టర్ల మరో అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమిళనాడు స్టార్ సాయిసుదర్శన్‌ను కూడా అఫ్గాన్ టెస్టుకు ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ప్రిన్స్‌కు పిలుపు!
మరోవైపు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఢిల్లీ స్పీడ్‌స్టర్ ప్రిన్స్ యాదవ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ ప్రిన్స్ సత్తాచాటాడు. హర్షిత్ రాణా గాయపడడంతో అతడి స్ధానంలో ప్రిన్స్ పరీక్షించాలని బీసీసీఐ భావిస్తుందంట.
చదవండి: గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు


