మన్జోత్ కల్రా.. ఈ క్రికెటర్ గురుంచి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ 2018 అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో అతడిది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో అద్భుతమైన సెంచరీ సాధించి టీమిండియాను మన్జోత్ ఛాంపియన్‌గా నిలిపాడు.
ఆ టోర్నమెంట్ సమయంలో పృథ్వీ షా, శుభమన్ గిల్ వంటి స్టార్లతో సమానంగా మన్జోత్ కల్రా పేరు కూడా మారుమోగింది. భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడని అంతా భావించారు. ఆ టోర్నీ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) అతన్ని ఐపీఎల్ కోసం కొనుగోలు చేసింది.
అయితే 2019లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన కొద్దికాలానికే అతడి కెరీర్ ఊహించని మలుపులు తిరిగింది. వయస్సులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కల్రాపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత పునరాగనమం చేసినప్పటికి అతడు రాణించలేకపోయాడు. మన్జోత్ కల్రా చివరగా ఢిల్లీ తరపున 2021లో లిస్ట్-ఏ క్రికెట్‌లో ఆడాడు.
ఫ్రాంచైజీ ఓనర్‌గా కల్రా
అయితే మన్జోత్ కల్రా మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచంలో సరికొత్త పాత్రలో కన్పించేందుకు సిద్దమయ్యాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీకి సహ-యజమానిగా అతడు మారాడు. మన్జోత్ .. ప్రముఖ పారిశ్రామికవేత్త మయాంక్ గోయెల్‌తో కలిసి 'స్పోర్ట్స్ కమ్యూన్' అనే సంస్థ ద్వారా జాఫ్నా కింగ్స్ జట్టులో వాటాలను కొనుగోలు చేశాడు.
ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపిక, ఆపరేషన్స్ బాధ్యతలను కల్రా పర్యవేక్షించనున్నాడు. లంక ప్రీమియర్ లీగ్-2026 సీజన్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ


