World Cup 2022: హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత తొలి విజయం.. భారత్‌ను ఓడించి

ICC Women World Cup 2022 Ind W Vs Eng W: England Beat India By 4 Wickets - Sakshi

భారత్‌కు రెండో పరాజయం

4 వికెట్లతో ఇంగ్లండ్‌ గెలుపు 

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌

స్ఫూర్తిదాయక ఆటతో వెస్టిండీస్‌పై భారీ విజయం సాధించి ఆశలు రేపిన భారత మహిళల ఆట ఒక్కసారిగా గతి తప్పింది. పేలవ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ ముందు మన జట్టు తలవంచింది. ఒక్కరూ కూడా కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఆరంభంలోనే రెండు వికెట్లు తీసినా... చివరకు ప్రత్యర్థి గెలుపును ఆపలేకపోయారు. మిగిలిన మూడు మ్యాచ్‌లలో రెండు బలమైన ప్రత్యర్థులే కావడంతో సెమీస్‌ చేరేందుకు భారత్‌ తీవ్రంగా శ్రమించాల్సి ఉంది.  

మౌంట్‌ మాంగనీ: గత వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన సమరం దాదాపు ఏకపక్షంగా సాగింది. ఇంగ్లండ్‌ కూడా గొప్పగా ఆడకపోయినా చేవ లేని భారత బ్యాటింగ్‌ ఆ జట్టుకు కలిసొచ్చింది. బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో భారత మహిళలపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 36.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. స్మృతి మంధాన (58 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచా ఘోష్‌ (56 బంతుల్లో 33; 5 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చార్లీ డీన్‌ (4/23) భారత్‌ను పడగొట్టింది. అనంతరం ఇంగ్లండ్‌ 31.2 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. కెప్టెన్‌ హీతర్‌ నైట్‌ (72 బంతుల్లో 53 నాటౌట్‌; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో పాటు నాట్‌ సివర్‌ (46 బంతుల్లో 45; 8 ఫోర్లు) రాణించింది.   
టపటపా...
తన రెండో ఓవర్లోనే ఓపెనర్‌ యస్తిక భాటియా (8)ను అవుట్‌ చేసి భారత్‌ పతనానికి శ్రీకారం చుట్టిన ష్రబ్‌సోల్‌ తన తర్వాతి ఓవర్లో మిథాలీ రాజ్‌ (1)ను కూడా వెనక్కి పంపించింది. ఆ వెంటనే లేని సింగిల్‌కు ప్రయత్నించి దీప్తి శర్మ (0) రనౌటైంది. డీన్‌ వేసిన ఒకే ఓవర్లో హర్మన్‌ (14), స్నేహ్‌ రాణా (0) కూడా పెవిలియన్‌ చేరడంతో 61 పరుగుల వద్దే భారత్‌ సగం వికెట్లు కోల్పోయింది. దాంతో మరో ఎండ్‌లో స్మృతి తన సహజశైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడుతూ ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే ఎకెల్‌స్టోన్‌ బౌలింగ్‌లో స్మృతి వికెట్ల ముందు దొరికిపోగా, పూజ వస్త్రకర్‌ (6) కూడా ఇదే తరహాలో అవుటైంది. ఈ దశలో రిచా, జులన్‌ గోస్వామి (20) కొంత ధాటిని ప్రదర్శించడంతో స్కోరు వంద పరుగులు దాటింది.  

మేఘనకు 3 వికెట్లు...
సునాయాస ఛేదనలో ఇంగ్లండ్‌ తడబాటుకు గురైంది. 4 పరుగులకే ఆ జట్టు వ్యాట్‌ (1), బీమాంట్‌ (1) వికెట్లు కోల్పోయింది. మేఘన తన తొలి స్పెల్‌లో ప్రత్యర్థిని కట్టిపడేసింది. 4 ఓవర్లలో ఆమె 20 డాట్‌ బంతులు వేయడం విశేషం.  అయితే నైట్, సివర్‌ చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేస్తూ ఇంగ్లండ్‌ను గెలుపు దిశగా నడిపించారు. సివర్‌ను అవుట్‌ చేసి పూజ ఈ జోడీని విడదీయగా...66 బంతుల్లో నైట్‌ అర్ధసెంచరీ పూర్తయింది. విజయానికి చేరువైన దశలో ఒకే ఓవర్లో ఇంగ్లండ్‌ రెండు వికెట్లు కోల్పోయినా,  కెప్టెన్‌ నైట్‌ అజేయంగా నిలిచి తన బాధ్యతను పూర్తి చేసింది. 

చదవండి: 46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్‌ హీరోయిన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top