ధోనికి ఆ హోదా ఇవ్వడం నచ్చలేదు.. కానీ: మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ | I Was Reluctant But: Army Veteran On MS Dhoni Getting Honorary Rank | Sakshi
Sakshi News home page

ధోనికి ఆ హోదా ఇవ్వడం మొదట్లో నచ్చలేదు: మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌

Apr 22 2026 3:32 PM | Updated on Apr 22 2026 3:41 PM

I Was Reluctant But: Army Veteran On MS Dhoni Getting Honorary Rank

టీమిండియా దిగ్గజ కెప్టెన్‌గా పేరుగాంచాడు మహేంద్ర సింగ్‌ ధోని. భారత్‌కు 2007లో టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే వరల్డ్‌కప్‌, 2013లో చాంపియన్స్‌ ట్రోఫీ అందించిన ఘనుడు. తద్వారా దేశానికి మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా నేటికీ కొనసాగుతున్నాడు ధోని.

సాహసోపేత నిర్ణయాలతో భారత జట్టు భవితవ్యాన్ని మార్చివేసిన ధోని (MS Dhoni).. జట్టు అవసరాల దృష్ట్యా కొన్నిసార్లు వ్యక్తిగత జీవితాన్ని సైతం త్యాగం చేశాడు. ముఖ్యంగా తనకు కుమార్తె జన్మించిన సమయంలో భార్య దగ్గర ఉండాల్సి ఉన్నా.. జట్టుతోనే ఉండిపోయాడు ధోని. ఇలాంటి త్యాగాలెన్నో అతడి కెరీర్‌లో ఉన్నాయి.

గౌరవ ఆర్మీ ర్యాంకు
ఈ క్రమంలోనే భారత సైన్యంలో ధోనికి గొప్ప గౌరవం లభించింది. పారాచూట్‌ రెజిమెంట్‌లో 2011లో అతడికి లెఫ్టినెంట్‌ హోదా ఇచ్చి ఆర్మీ సుముచిత గౌరవం కల్పించింది. ఆ తర్వాత కఠినమైన పారాచూట్‌ శిక్షణ పూర్తి చేసుకున్న ధోని.. ప్రతిష్టాత్మక ‘మెరూన్‌ బెరెట్‌’ (headgear) సొంతం చేసుకున్నాడు.

మొదట్లో నాకు నచ్చలేదు
ఈ నేపథ్యంలో రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వినోద్‌ భాటియా ధోనికి నాడు దక్కిన గౌరవం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనికి అసలు ఆ అర్హత ఉందా? అనే సందేహం తనను తొలచివేసిందన్నారు. తాను ధోనికి ఈ హోదా ఇవ్వడాన్ని తాను తొలుత కాస్త వ్యతిరేకించానని.. అయితే, ఆ తర్వాత తన అభిప్రాయం తప్పని తేలిందన్నారు.

ఈ మేరకు.. ‘‘అప్పట్లో మా చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌. అప్పటి భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి గౌరవ ర్యాంకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను మాత్రం అందుకు సుముఖంగా లేను. మెరూన్‌ బెరెట్‌ ఎంతో ప్రతిష్టాత్మకమైనది.

పారాట్రూపర్‌ కావాలంటే కచ్చితంగా ఆర్నెళ్ల పాటు ప్రొబేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇదిలా చాలా కఠినంగా ఉంటుంది. ఇందులో సెలక్షన్‌ రేటు కేవలం 20 శాతం మాత్రమే. అలాంటిది ఎలాంటి శిక్షణా పొందని వ్యక్తికి మెరూన్‌ బెరెట్‌ ఇవ్వడం చాలా తప్పు అని అనిపించింది. ఆ తర్వాత నా అభిప్రాయం మారిపోయింది.

నిజమైన సైనికుడు
ధోని దేశం కోసం చాలా చేశాడు. అతడి విజయాల పట్ల నేను కూడా గర్విస్తున్నాను. ఒత్తిడిలోనూ ‍ప్రశాంతంగా ఉండే కెప్టెన్‌ కూల్‌. బాగా ఎత్తైన ప్రదేశాలంటే భయమని అతడు నాతో చెప్పాడు. అయినప్పటికీ పారాట్రూపర్‌గా శిక్షణలో ఎత్తుల మీద నుంచి దూకేశాడు.

యూనిఫామ్‌ ధరించినపుడు అతడిలో ఓ గర్వం ఉండేది. అతడు అచ్చంగా సైనికుడిలాగే కవాతు చేసేవాడు. సైనికుడి మాదిరే వ్యవహరించేవాడు. మనసు నిండా అతడు ఆర్మీని నింపుకొన్నాడని.. తనను తాను నిజమైన సోల్జర్‌గా భావిస్తున్నాడని నాకు తెలిసింది.

ఇంకో విషయం.. ధోని జమ్మూ కశ్మీర్‌లో మా విభాగాలతో కలిసి అక్కడ పనిచేశాడు. లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి మా సైనికులతో కలిసి ప్రయాణాలు చేసేవాడు. నిజంగా అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి’’ అని రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ వినోద్‌ భాటియా ఓ పాడ్‌కాస్ట్‌లో భాగంగా ధోనిని కొనియాడారు.

చదవండి: బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్‌ మూసివేత

Advertisement
 
Advertisement
Advertisement