T20 WC Semis: నరాలు తెగే ఉత్కంఠ.. నాకు వాళ్ల మద్దతు | Heard few RCB chants: Bethell recalls T20 WC semi final knock vs IND | Sakshi
Sakshi News home page

T20 WC IND vs ENG: నరాలు తెగే ఉత్కంఠ.. నాకు మద్దతుగా వాళ్లు!

Mar 26 2026 7:13 PM | Updated on Mar 26 2026 7:27 PM

Heard few RCB chants: Bethell recalls T20 WC semi final knock vs IND

ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ జేకబ్‌ బెతెల్‌ ఆసక్తికర విషయం పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 సెమీ ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ తనకు ఊహించని విధంగా మద్దతు లభించిందన్నాడు. భారత్‌ వేదికగా జరిగిన ఈ ఐసీసీ టోర్నీ రెండో సెమీస్‌ మ్యాచ్‌లో టీమిండియా- ఇంగ్లండ్‌ (IND vs ENG) తలపడిన విషయం తెలిసిందే.

253 పరుగుల భారీ స్కోరు
ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

టాపార్డర్‌లో ఫిల్‌ సాల్ట్‌ (5), కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook- 7) పూర్తిగా విఫలం కాగా.. జోస్‌ బట్లర్‌ 25 పరుగులు చేయగలిగాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ జేకబ్‌ బెతెల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఇంగ్లండ్‌ శిబిరంలో ఆశలు రేపాడు.

బెతెల్‌ విధ్వంసకర సెంచరీ
కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 105 పరుగలతో బెతెల్‌ సత్తా చాటాడు. అయితే, అతడు రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఆశలు అడియాసలయ్యాయి. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్‌ నాలుగు బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచినా.. విజయానికి ఇంగ్లండ్‌ ఏడు పరుగుల దూరంలో నిలిచింది. ఫలితంగా గెలుపు జెండా ఎగురవేసిన భారత్‌.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే.. వాంఖడేలో తాను విధ్వంసకర రీతిలో విరుచుకుపడుతున్న వేళ ఎదురైన అనుభవాన్ని జేకబ్‌ బెతెల్‌ తాజాగా పంచుకున్నాడు. అతడు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ను తిప్పేస్తాడనే భయంతో మైదానం నిశ్శబ్దంగా మారిన వేళ.. కొంతమంది మాత్రం ఆర్సీబీ నామస్మరణ చేశారట.

వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు
ఈ విషయం గురించి బెతెల్‌ మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవరించిన తరుణంలో కొంతమంది ఆర్సీబీ అని అరవడం నా చెవిన పడింది. అలా వాళ్లు నాకు మద్దతుగా నిలిచారు’’ అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్‌ తనపై ప్రేమ చూపించారంటూ పొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా 22 ఏళ్ల బెతెల్‌ గతేడాది ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 67 పరుగులు చేశాడు. మినీ వేలానికి ముందు ఆర్సీబీ బెతెల్‌ను అట్టిపెట్టుకోగా ఈసారి మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. ప్రపంచ రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement