చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. ప్రపంచ రికార్డు | NZ vs SA: Esterhuizen Creates History Becomes First Player In World To | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. ప్రపంచ రికార్డు

Mar 26 2026 1:47 PM | Updated on Mar 26 2026 1:57 PM

NZ vs SA: Esterhuizen Creates History Becomes First Player In World To

సౌతాఫ్రికా క్రికెటర్‌ కానర్‌ ఎస్తురూజెన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నిలిచాడు ఎస్తురూజెన్‌.

సంగక్కర రికార్డు బద్దలు
తద్వారా శ్రీలంక దిగ్గజం కుమార్‌ సంగక్కర 2009లో నెలకొల్పిన రికార్డును ఎస్తురూజెన్‌ బద్దలు కొట్టాడు. కాగా ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లింది. ఈ సిరీస్‌లో ఎస్తురూజెన్‌ మొత్తంగా 200 పరుగులు స్కోరు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

ఇక బుధవారం ముగిసిన ఐదో టీ20లో ఎస్తురూజెన్‌ 33 బంతుల్లో 75 పరుగులు సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 2009లో సంగక్కర కివీస్‌పై 69 పరుగులు చేశాడు.  

33 పరుగుల తేడాతో..
మ్యాచ్‌ విషయానికొస్తే.. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా బుధవారం జరిగిన నిర్ణయాత్మక పోరులో కేశవ్‌ మహరాజ్‌ సారథ్యంలోని సౌతాఫ్రికా జట్టు 33 పరుగుల తేడాతో.. ఆతిథ్య న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో చేజిక్కించుకుంది. 

ఈ సిరీస్‌ ద్వారానే నలుగురుసౌతాఫ్రికా ప్లేయర్లు అరంగేట్రం చేసినా... వారంతా సమయానుకూలంగా మెరిపించడంతో సఫారీ జట్టు సులువుగా సిరీస్‌ కైవసం చేసుకుంది.

ధనాధన్‌ హాఫ్‌సెంచరీ
న్యూజిలాండ్‌ గడ్డపై దక్షిణాఫ్రికా 2012లో 2–1తో... 2017లో 1–0తో టీ20 సిరీస్‌లను సొంతం చేసుకుంది. ఇక చివరిదైన ఐదో మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. 

గత మ్యాచ్‌లో అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కానర్‌ ఎస్తురూజెన్‌ (33 బంతుల్లో 75; 5 ఫోర్లు) మరోసారి ధనాధన్‌ హాఫ్‌సెంచరీతో చెలరేగాడు.

రుబిన్‌ హెర్మన్‌ (39; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ముల్డర్‌ (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అతడికి సహకరించారు. కివీస్‌ బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో... పరుగుల రాక గగనమైంది. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 79/2తో నిలిచింది. ఈ దశలో కానర్‌ భారీ షాట్‌లతో చెలరేగిపోయాడు.

నాలుగో వికెట్‌కు ఫోరెస్టర్‌ (21 నాటౌట్‌)తో కలిసి కానర్‌ 27 బంతుల్లో 61 పరుగులు జోడించడంతో సఫారీ జట్టు మంచి స్కోరు చేయగలిగింది. చివరి 10 ఓవర్లలో సౌతాఫ్రికాకా 111 పరుగులు రాబట్టింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో బెన్‌ సీర్స్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

154 పరుగులకు పరిమితం
అనంతరం ఓ మాదిరి లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకు పరిమితమైంది. బెవాన్‌ జాకబ్స్‌ (19 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్‌ జేమ్స్‌ నీషమ్‌ (24), టిమ్‌ రాబిన్‌సన్‌ (25), క్లీవర్‌ (22) తలా కొన్ని పరుగులు చేశారు.

అయితే, కివీస్‌ బ్యాటర్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోవడంతో... ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో కోట్జీ, ముల్డర్, బార్ట్‌మన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కానర్‌ ఎస్తురూజెన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. 

చదవండి: IPL 2026: ప్యాట్‌ కమ్మిన్స్‌ కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement